అప్పుడు రాలేదే: బిజెపి, స్మృతిపై మాయావతి ఫైర్, రాహుల్ తర్వాత హైద్రాబాద్‌కు కేజ్రీవాల్
హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ విశ్వవిద్యాలయంలో వేముల రోహిత్ ఆత్మహత్య నేపథ్యంలో ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ మంగళవారం నాడు వెంటనే హైదరాబాద్ వచ్చారు. దీని పైన బిజెపి నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
బిజెవైఎం నేత విష్ణువర్ధన్ రెడ్డి బుధవారం రాహుల్ గాంధీ పైన నిప్పులు చెరిగారు. తన ఇద్దరు పిల్లలతో సహా రాజయ్య కోడలు ఆత్మహత్య చేసుకుంటే రాహుల్ గాంధీ ఎందుకు రాలేదని ప్రశ్నించారు. రోహిత్ ఆత్మహత్య దురదృష్టకరమన్నారు. కాంగ్రెస్ పార్టీ కులాల పేరుతో రాజకీయం చేస్తోందన్నారు. రోహిత్ ఆత్మహత్య పైన సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలన్నారు.
ఏపీ, తెలంగాణ బిజెపి నేతలు రాహుల్ గాంధీ పర్యటన పైన మండిపడుతున్నారు. తెలంగాణ బిజెపి అధ్యక్షులు కిషన్ రెడ్డి, ఏపీ బిజెపి అధ్యక్షులు హరిబాబు, ఏపీ బిజెపి నేత కామినేని శ్రీనివాస్ రావు, తెలంగాణ బిజెపి నేతలు విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు రాహుల్ రాకను ప్రశ్నిస్తున్నారు.

గతంలోను విశ్వవిద్యాలయాలలో ఆత్మహత్యలు జరిగాయని అప్పుడు ఎందుకు రాలేదని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు హఠాత్తుగా రావడం రాజకీయ లబ్ధి కోసమే అన్నారు. అలాగే, రాజయ్య ఇంట్లో ఘటన జరిగినప్పుడు ఎందుకు రాలేదని ప్రశ్నించారు.
రేపు తెలంగాణ బంద్‌కు పిలుపు
తెలంగాణ దళిత సంఘాలు రేపు (గురువారం) తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చాయి. రోహిత్ ఆత్మహత్యకు కారణమైన ఏబీవీపీ నాయకులు, కేంద్రమంత్రులు బండారు దత్తాత్రేయ, స్మృతి ఇరానీ, వీసీ అప్పారావుల వేధింపులే కారణమన్నారు.
స్మృతి ఇరానీపై చర్యలు తీసుకోండి: మాయావతి
కేంద్రమంత్రులు స్మృతి ఇరానీ, బండారు దత్తాత్రేయ పైన న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని బిఎస్పీ అధినేత్రి మాయావతి బుధవారం డిమాండ్ చేశారు. అలాగే వైస్ ఛాన్సులర్ అప్పారవు పైన కూడా చర్యలు తీసుకోవాలన్నారు. రోహిత్ పైన వారి తీరు ఖండించదగ్గదన్నారు. ఇది అప్రజాస్వామ్యమన్నారు.
రోహిత్ కుటుంబాన్ని పరామర్శించనున్న కేజ్రీవాల్
రోహిత్ కుటుంబ సభ్యులను ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పరామర్శించనున్నారు. గురువారం ఆయన హైదరాబాద్ కు వస్తున్నారని ఢిల్లీ ప్రభుత్వ అధికారి ఒకరు వెల్లడించారు. తొలుత రాహుల్ గాంధీ వచ్చారు, ఇప్పుడు కేజ్రీవాల్ వస్తుండటం గమనార్హం.












Click it and Unblock the Notifications