ట్విస్ట్: బిటెక్ విద్యార్థిని మృతి, తాగి అతను కారు నడిపాడా?
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులో సోమవారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదం ఘటన మలుపు తీసుకుంది. బిటెక్ విద్యార్థి సామ భరత్ సింహా రెడ్డి మద్యం సేవించి కారు నడపడం వల్లనే ప్రమాదం సంభవించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ రోడ్డు ప్రమాదంలో బిటెక్ విద్యార్థిని దేవి మరణించింది.
హైదరాబాదులోని జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్ పరిధిలో ఆ ప్రమాద ఘటన చోటు చేసుకుంది. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ డికె నగర్ రెసిడెన్సీలో నివసించే బిల్డర్ కట్కూరి నిరంజన్ రెడ్డి చిన్న కూతురు దేవి (21) నారాయణమ్మ ఇంజనీరింగ్ కాలేజీలో బిటెక్ మూడో సంవత్సరం చదవుతోంది.
మిత్రుడు సామ భరత్ సింహా రెడ్డి (23) కారులో శనివారం రాత్రి నానక్‌రామ్ గుడాలో గల ఓ హోటల్ ప్రారంభోత్సవానికి వెళ్లింది. భరత్ సింహా రెడ్డి యూసుఫ్ గుడాలోని సెయింట్ మేరీస్ డిగ్రీ కాలేజీలో బీకాం రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఇతను మాదాపూర్‌లో నివసించే ఫంక్షన్ హాళ్ల యజమాని సామ సుభాష్ రెడ్డి కుమారుడు.

హోటల్ ప్రారంభోత్సవ కార్యక్రమం ముగిసిన తర్వాత మరో ఇద్దరు స్నేహితులతో కలిసి భరత్, దేవి కారులో తిరుగుముఖం పట్టారు. మధ్యలో ఇద్దరు స్నేహితులను విడిచిపెట్టి వారిద్దరు జర్నలిస్టు కాలనీ మీదుగా డికె నగర్ వెళ్తున్నారు. ఆదివారం తెల్లవారు జామున ముూడున్నర గంటలకు ఎక్కడున్నావంటూ తండ్రి నుంచి దేవికి ఫోన్ వచ్చింది.
దగ్గర్లోనే ఉన్నా, రెండు నిమిషాల్లో ఇంట్లో ఉంటా అని సమాధానం చెప్పిందో లేదో ప్రమాదం జరిగింది. ఫోన్ ఆమె బదులిచ్చిన పది నిమిషాలకే అతి వేగంగా వెళ్తున్న కారు అదుపు తప్పి దేవి ఇంటి సమీపంలోని చెట్టును ఢీకొట్టింది. ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయి డ్రైవింగ్ సీట్లో ఉన్న భరత్ ప్రాణాలతో బయటపడ్డాడు. అతని పక్కన కూర్చున్న దేవి తలకు తీవ్రంగా గాయమైంది.
పోలీసులు అపోలో ఆస్పత్రికి తరలించిన కొద్దిసేపటికే దేవి తుదిశ్వాస విడిచింది. నిర్లక్ష్యంగా కారు నడిపి ఒకరి ప్రాణాలు పోవడానికి కారణమైన భరత్‌పై పోలీసులు ఐపిసి సెక్షన్ 304 (ఎ) కింద కేసు నమోదు చేశారు. అతన్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. బ్రీత్ ఎనలైజర్ పరీక్షలు నిర్వహించారు. ఛాతీ నొప్పితో బాధపడుతుండడంతో అతన్ని అస్పత్రికి పంపించారు.












Click it and Unblock the Notifications