బుల్లెట్ బండి పాట పెడితేనే పాలు తాగుతున్న కొండముచ్చు .. చివరకు వానరం కూడానా.. ఇదో వేలంవెర్రి !!
ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో బుల్లెట్ బండి పాట వేలంవెర్రిగా తయారైంది. ఎక్కడ చూసినా ఆ పాట హల్చల్ చేస్తుంది. ఏ పెళ్లిలో చూసినా ఆ పాట ప్రధానంగా వినిపిస్తోంది. ఇక జోష్ వంటి యాప్స్ లోనూ ఈ పాటే ట్రెండ్ అవుతుంది. బుల్లెట్ బండి పాటకు విపరీతమైన క్రేజ్ పెరిగింది. ఎంతగా బుల్లెట్ బండి పాట క్రేజీగా మారిందంటే, సాక్షాత్తూ కొండముచ్చు ఆ పాట వింటే తప్ప పాలు తాగనంతగా నచ్చిందంటే ఇక ఈ పాట ఏ రేంజ్ లో మోత మోగుతుందో అర్థం చేసుకోవచ్చు.

మనుషులకే కాదు జంతువులకు నచ్చుతున్న బుల్లెట్ బండి పాట
అటు మనుషులకే కాదు ఇటు జంతువులకు , ఏకంగా వానరాలకు సైతం బుల్లెట్ బండి పాట విపరీతంగా నచ్చుతుంది అంటే ఈ పాట పిచ్చి ఎంతగా పెరిగి పోయిందో అర్థం చేసుకోవచ్చు. ఇంతకీ కొండముచ్చు బుల్లెట్ బండి పాట వింటేనే పాలు తాగడం ఏమిటి ? అని ఆలోచించే వారికి ఈ కొండముచ్చు కథ చెప్పాల్సిందే. మహబూబాబాద్ లోని కంబాలపల్లి గ్రామంలో ఓ వ్యక్తి కిరణా షాప్ నడుపుతున్నాడు. కోతుల బెడద ఎక్కువగా ఉన్న ఆ గ్రామంలో, కోతుల నుండి తన షాప్ ను, సరుకులను కాపాడుకోవడం కోసం కొండముచ్చును పెంచుతున్నాడు. ఆ కొండముచ్చుకు ఒక పిల్ల కొండెంగ కూడా ఉంది.

బుల్లెట్ బండి పాట పెడితే చకచకా పాలు తాగుతున్న కొండ ముచ్చు
కొద్ది రోజుల క్రితం తల్లి కొండముచ్చు అనారోగ్యంతో మరణించింది. అప్పటి నుండి పిల్ల కొండముచ్చు పాలు తాగడం మానేసింది. తల్లి మీద దిగులుతో పాలు తాగని కొండముచ్చుకు పాలు పట్టడం కోసం యజమాని చాలా కష్టపడ్డాడు. బుల్లెట్ బండి పాట పెడితే విన్న కొండ ముచ్చు చకచకా పాలు తాగేసింది.దీంతో ఊరి జనం కొత్త ట్రెండ్ కు శ్రీకారం చుట్టారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న, అందరి నోళ్లలో నానుతున్న బుల్లెట్ బండెక్కి వచ్చేత్తావా డుగ్గుడుగ్గని పాట పెట్టి బుజ్జి కొండముచ్చుకు పాలు పట్టటం మొదలు పెట్టారు. ఇంకేం ఈ పాట బాగా నచ్చిన బుజ్జి కొండముచ్చు ఎంచక్కా పాలను తాగేసి, పాటను ఎంజాయ్ చేసింది.

బుల్లెట్ బండి పాటను ఎంజాయ్ చేస్తున్న కొండెంగ
ఫోన్ చేతిలో పట్టుకొని పాట వింటూ మాత్రమే పాలను తాగుతుంది. ఇక ఆ కొండముచ్చును చూసినవారంతా బుల్లెట్ బండి పాటకు పాలు తాగుతున్న తీరు చూసి ఆశ్చర్యపోతున్నారు. ఇక తమ తమ ఫోన్లలో ఆ పాట పెట్టి మరి దానికి వినిపించి, మచ్చిక చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక దాని చేష్టలను వీడియో తీసుకుంటున్నారు. ఏది ఏమైనా సంగీతానికి కఠిన శిలలైనా కరగాల్సిందే అన్న పెద్దల నానుడిని నిజం చేస్తూ, మనుషులపైనే కాదు జంతువుల పైన కూడా సంగీతం ప్రభావం చూపిస్తుంది అన్నది తాజా ఘటనతో వ్యక్తమౌతుంది.
Recommended Video
పాటకు అడిక్ట్ అయిన వానరం .. ఇప్పుడు ఇదో చర్చ
బుల్లెట్ బండి పాట చూస్తూ ప్రశాంతంగా పాలు తాగుతున్న కొండముచ్చు అందుకు నిదర్శనంగా నిలుస్తుంది. బుల్లెట్ బండి పాట చూస్తున్నంత సేపు దాని శ్రద్ధ పూర్తిగా పాట పైనే ఉంటుంది .అక్కడ పక్కనే ఉన్న ఎంతమంది దృష్టి మళ్లించే ప్రయత్నం చేసినా అది మాత్రం పాటకు అడిక్ట్ అయిపోయింది. మొత్తానికి ఒక నవ వధువు చేసిన డాన్స్ తో పెద్ద ఎత్తున వైరల్ అయిన బుల్లెట్ బండి పాట, ఇప్పుడు పాట వింటూ పాలు తాగుతున్న వానరం తీరుతో మరింత చర్చనీయాంశంగా మారింది.












Click it and Unblock the Notifications