మునుగోడులో పట్టుబడుతున్న నగదు; ఓటర్లను ప్రలోభపెడుతున్న స్థానికేతరులు; పోలింగ్ కేంద్రాల వద్ద ఆందోళనలు
మునుగోడు లో ఉపఎన్నిక పోలింగ్ కొనసాగుతున్న సమయంలో అనేకచోట్ల నగదు పంచుతుండగా పట్టుకుంటున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి. ఇక స్థానికేతరులు ఉన్నారంటూ, ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారంటూ మునుగోడులో పలు పార్టీల నేతలు ఆందోళనకు దిగుతున్నారు.

డబ్బులు పంచుతున్న టీఆర్ఎస్ నాయకులు.. పట్టుకున్న స్థానికులు
తాజాగా నాంపల్లి మండలం టీపీ గౌరారం లో టిఆర్ఎస్ నాయకులు డబ్బులు పంచుతుండగా స్థానికులు పట్టుకున్నారు. ఎమ్మెల్సీ ఎంసీ కోటి రెడ్డి కి సంబంధించిన అనుచరుల వాహనాలలో నగదు పంచుతున్నట్టు గుర్తించారు. మల్లపరాజు పల్లి లో 10 లక్షల నగదును అధికారులు పట్టుకున్నారు. టిఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రలోభాలకు తెర తీశారని ప్రతిపక్ష పార్టీల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

చండూరులోనూ పట్టుబడ్డ నగదు.. బ్యాగ్లు వదిలి పారిపోయిన స్థానికేతరులు
కాగా చండూర్ మున్సిపాలిటీ లోనూ పార్టీ నేతలు డబ్బులు పంచు తుండగా పట్టుకున్న స్థానికులు, స్థానికేతరుల బ్యాగుల నుండి డబ్బు కట్టలను గుర్తించారు. మీరెవరు అని గట్టిగా ప్రశ్నించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులను చూసి సదరు వ్యక్తులు బ్యాగ్లను వదిలేసి పరారయ్యారు. ఘటనా స్థలంలో రెండు లక్షల రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక మునుగోడులో ఓటమి భయంతో టిఆర్ఎస్ పార్టీ ఓటర్లను ప్రలోభ పెట్టడానికి స్థానికేతరులను రంగంలోకి దించింది అని బిజెపి, కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనేక పోలింగ్ కేంద్రాల వద్ద టిఆర్ఎస్ పార్టీ కి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారు.
మర్రిగూడలో స్థానికేతరుల ప్రచారం.. పోలింగ్ కేంద్రాల వద్ద బీజేపీ, కాంగ్రెస్ ఆందోళన
మర్రిగూడ లో స్థానికేతరులు ప్రచారం చేస్తున్నారని, ఓటర్లను ప్రలోభ పెడుతున్నారని బీజేపీ శ్రేణులు పోలింగ్ కేంద్రం వద్ద ఆందోళన చేపట్టారు. టిఆర్ఎస్ పార్టీకి వత్తాసుగా పోలీసుల తీరు ఉందని బిజెపి శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకోకుండా బిజెపి కార్యకర్తలపై లాఠీచార్జి చేశారు. ఆందోళన పెద్దది కాకుండా వారిని అక్కడి నుంచి చెదరగొట్టారు. ఇక మునుగోడులో పోలింగ్ బూత్ వద్ద కు టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పార్టీ కండువాలు జెండాలతో వచ్చి ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆందోళనకు దిగారు.
చిన్నపిల్లలతో పోలింగ్ కేంద్రాల వద్ద టీఆర్ఎస్ ప్రచారం వీడియో
పోలింగ్ సమయంలో టిఆర్ఎస్ పార్టీ మునుగోడులో అధికార దుర్వినియోగానికి దిగడం మాత్రమే కాకుండా పార్టీ జెండాలతో చిన్న పిల్లలను సైతం పోలింగ్ కేంద్రాల వద్ద ప్రచారానికి నిలబెట్టిందని కేపాల్ సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోను ట్వీట్ చేశారు. ఓట్ల కోసం టిఆర్ఎస్ పార్టీ ఇంతగా దిగజారిపోయింది అంటూ కేఏ పాల్ తన ఫేస్ బుక్ పేజ్ లో పేర్కొన్నారు. టిఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకే ఓటు వేయాలని జెండాలు, ప్ల కార్డులు పట్టుకొని టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు చేస్తున్న ప్రచారంపై ప్రతిపక్ష పార్టీల నాయకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications