ఓటుకు నోటు కేసులో కీలక మలుపు: కేంద్ర ఎన్నికల కమిషన్ సీరియస్
హైదరాబాద్: నోటుకు ఓటు కేసు కీలక మలుపు తీసుకునే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. తెలంగాణ నామినేటెడ్ శాసనసభ్యుడు స్టీఫెన్‌సన్‌కు లంచం ఇస్తూ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి పట్టుబడిన కేసును కేంద్ర ఎన్నికల కమిషన్ (ఈసి) సీరియస్‌గా తీసుకుంటుందనే ప్రచారం సాగుతోంది.
ఈసి క్రిమినల్ కేసు పెట్టడంతో పాటు అనర్హత వేయడానికి కూడా సిద్ధపడుతున్నట్లు చెబుతున్నారు. ఈ కేసులో ఎసిబి సాక్ష్యాలుగా సమర్పించిన 14 ఆడియో, వీడియో టేపుల కాపీలను తమకు ఇ్వవాలని కోరుతూ సిఈసి తరఫున న్యాయవాది ఎసిబి కోర్టులో మెమో దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఈసి ఈ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుందని భావిస్తున్నారు.

ఆడియో, వీడియో టేపులను పరీక్షించిన ఫోరెన్సిక్ సైన్స్ లాబోరేటరీ ఓ నివేదిక కూడా సమర్పించింది. ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ నుంచి వచ్చిన టేపులను ఎసిబి కోర్టు పరిశీలిస్తోంది. ఈ లోపలే వాటి కోసం ఈసి మెమో దాఖలు చేసింది. తమ వద్ద ఒక్క కాపీ మాత్రమే ఉందని, ఎఫ్ఎస్ఎల్ నుంచి మరో కాపీ అందితే అప్పుడు ఇవ్వాలా, వద్దా అనే విషయంపై నిర్ణయం తీసుకుంటామని న్యాయమూర్తి చెప్పారు.
ఆడియో, వీడియో టేపుల కాపీలు తమకు అందిన వెంటనే అవసరమైన చర్యలు తీసుకోవాలని ఈసి భావిస్తున్నట్లు చెబుతున్నారు. ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్ 123 ప్రకారమే కేసు నమోదు చేయాలని సిఈసి చూస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఆరోపణలు రుజువైతే సంబంధిత ప్రజాప్రతినిధులపై అనర్హత వేటు ఉంటుందని అంటున్నారు.












Click it and Unblock the Notifications