నోటుకు ఓటు, రేవంత్ వ్యాఖ్యలు: పోలీసు ఉన్నతాధికారులతో కెసిఆర్ భేటీ
హైదరాబాద్: బెయిల్‌పై విడుదలైన తర్వాత నోటుకు ఓటు కేసు నిందితుడు రేవంత్ రెడ్డి ర్యాలీ తీసి, తీవ్ర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలోనే కాకుండా కేసు దర్యాప్తు మందగించిందనే అభిప్రాయం పెరుగుతున్న నేపథ్యంలో కూడా తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు పోలీసు ఉన్నతాధికారులతో సమావేశం కావడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఆయన గురువారంనాడు పోలీసు ఉన్నతాధికారులతో తన క్యాంప్ కార్యాలయంలో సమావేశమయ్యారు.
పలువురు ఐపిఎస్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. వాస్తవానికి డిజిపి అనురాగ్ శర్మ కూడా ఈ సమావేశానికి రావాల్సి ఉంది. అయితే, తన తల్లి మరణించడంతో ఆయన సమావేశానికి రాలేకపోయారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని పలువురు డిసిపిలు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఇటీవల హోంశాఖ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన రాజీవ్ త్రివేది కూడా సమావేశంలో ఉన్నారు.

నోటుకు ఓటుకు కేసులో ఇప్పటి వరకు సాధించిన ప్రగతిపై సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. బెయిల్ మీద జైలు నుంచి విడుదలైన సందర్భంగా రేవంత్ రెడ్డి చేసిన హంగామాపై కూడా సమావేశంలో చర్చ జరిగినట్లు తెలుస్తోంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కెసిఆర్‌పై, మంత్రులపై నేరుగా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.
నిజానికి, ర్యాలీకి పోలీసుల అనుమతి లేదు. అనుమతి లేకపోయినా ర్యాలీ ఎలా చేశారనే విషయంపై కూడా సమావేశంలో చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. నోటుకు ఓటు కేసులో కొద్ది రోజుల్లో మరి కొంత మందికి నోటీసులు జారీ చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో కెసిఆర్ ముందు జాగ్రత్త చర్యల నిమిత్తం పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించారని అంటున్నారు. గురువారం ఉదయం ఎసిబి డిజి ఎకె ఖాన్‌తో సమావేశమైన తర్వాత కెసిఆర్ పోలీసు ఉన్నతాధికారులతో సమావేశం కావడం చర్చనీయాంశంగా మారింది.












Click it and Unblock the Notifications