నోటుకు ఓటు కేసు: తణుకులో జిమ్మీ, కొండల్ రెడ్డికి మరో నోటీసు?
హైదరాబాద్: నోటుకు ఓటు కేసులో తప్పించుకుని తిరుగుతున్న తెలుగు యువత నాయకుడు జిమ్మీ బాబును అరెస్టు చేయడానికి తెలంగాణ ఎసిబి రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి తనయుడు నారా లోకేష్ డ్రైవర్ కొండల్ రెడ్డికి మరో నోటీసు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది.
నోటుకు ఓటు కేసులో జిమ్మీబాబు, కొండల్ రెడ్డి కీలక పాత్ర పోషించినట్లు ఎసిబి అధికారులు భావిస్తున్నారు. నెల రోజుల క్రితం జిమ్మీబాబుకు ఎసిబి నోటీసు జారీ చేసింది. అయితే, అతను ఎసిబి విచారణకు డుమ్మా కొట్టి తప్పించుకుని తిరుగుతున్నాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తణుకు పట్టణంలో అతను తలదాచుకున్నట్లు ఎసిబి అధికారులు అనుమానిస్తున్నారు.

కొండల్ రెడ్డి కూడా ఎసిబి విచారణకు హాజరు కాలేదు. హైదరాబాదులోని యూసుఫ్‌గుడా వెంకటగిరిలో గల అతని నివాసానికి తాళం వేసి ఉంది. కొండల్ రెడ్డికి మరోసారి నోటీసు ఇవ్వాలని ఎసిబి అధికారులు అనుకుంటున్నారు. అదే సమయంలో జిమ్మీ బాబును అరెస్టు చేయడానికి ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
నోటుకు ఓటు కేసులో తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు రేవంత్ రెడ్డికి, మత్తయ్యకు మధ్య మధ్యవర్తిగా జిమ్మీ బాబు వ్యవహరించినట్లు ఎసిబి అధికారులు అనుమానిస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా టిడిపికి అనుకూలంగా తెలంగాణ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు డబ్బులు ఇచ్చి ఓటు వేయించుకునేందుకు రేవంత్ రెడ్డి మత్తయ్య ద్వారా సంప్రదించినట్లు ఎసిబి అధికారులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications