కావేరీ చిచ్చు: బెంగళూరుని ఆదుకున్న హైద్రాబాద్ టెక్కీలు, నిద్రలేకుండా..
హైదరాబాద్/బెంగళూరు: కావేరీ జల వివాదం నేపథ్యంలో కర్నాటక, తమిళనాడు రాష్ట్రాలు అట్టుడికాయి. దీంతో బెంగళూరులో ఎన్నో సాఫ్టువేర్ కంపెనీలు పని చేయలేదు. ఉద్యోగులకు సెలవులు ఇచ్చాయి. దీంతో సాఫ్టువేర్ ఎగుమతుల పైన ప్రభావం పడకుండా హైదరాబాద్ కాపాడింది!
కావేరీ నదీ జల వివాదం కర్ణాటక రాష్ట్రాన్ని స్తంభింప చేసింది. బెంగళూరు ఐటీ కంపెనీలపై ప్రభావం పడింది. దీంతో భాగ్యనగరం ఐటీ రంగం ఆదుకుంది. బెంగళూరులోని 85 శాతం వరకూ ఐటీ కంపెనీలు మూతబడ్డాయి. కస్టమర్లకు సరైన సమయంలో సేవలను అందించేందుకు ఆయా ఐటీ సంస్థలకు చెందిన హైదరాబాద్ శాఖల కార్యాలయాలు రంగంలోకి దిగాయి.
ఇక్కడి టెక్కీలు గత రెండు రోజుల్లో 36 గంటల పాటు విధులు నిర్వర్తించారు. హైదరాబాద్ ఐటీ కంపెనీల్లోని దాదాపు 25 వేల మంది టెక్కీలు బెంగళూరులో జరగాల్సిన పనులను చేస్తున్నారని, ఇక్కడ పరిస్థితి మరో రెండు రోజులు కుదురుకునేలా లేదని, తిరిగి కార్యాలయాలు ప్రారంభమయ్యే వరకూ హైదరాబాద్ నుంచే సేవలు అందిస్తామని కన్నడ రాష్ట్ర తెలంగాణ అసోసియేషన్ కార్యదర్శి సిరాజేందర్ తెలిపారు.
బెంగళూరులో కీలకమైన ఐటీ సేవలను అందించే తొంబై వేలమంది ఉద్యోగులు తమ విధులకు హాజరు కాలేని పరిస్థితులు నెలకొన్నాయి. సోమ, మంగళవారాలు పరిస్థితి మరీ తీవ్రంగా ఉంది. దీంతో, హైదరాబాద్‌లోని ఐటీ కంపెనీలు సోమవారం రాత్రి నుంచి తెరచి ఉంచారు.

మంగళవారం రాత్రి కూడా నిద్ర లేకుండా హైదరాబాద్ ఐటీ ఉద్యోగులు.. తమ బెంగళూరు మిత్రుల పని కూడా చేశారు.
సోమవారం అర్ధరాత్రి తన విధులు ముగిసిన తర్వాత తన డెస్క్ మీదనే నిద్రపోయానని, ఈ రోజు కూడా నేను ఇంటికి వెళ్లేది అనుమానమేనని, తనకు కాంపెన్ సేటరీ ఆఫ్ లభిస్తుందనుకున్నా, దానిని మరికొన్ని రోజులు తీసుకునే పరిస్థితి లేదని, బెంగళూరులో పరిస్థితి మెరుగుపడే వరకూ మేమంతా సెలవు తీసుకునే పరిస్థితి లేదని హైదరాబాద్ టెక్కీలు చెబుతున్నారు.
తాము డెడ్‌లైన్లు అందుకోవాల్సి ఉంటుందని, కస్టమర్ల నుంచి మాట పడకూడదన్నదే తమ అభిమతమని మరో ఐటీ కంపెనీ చెబుతోంది. బెంగళూరు ఐటీ కంపెనీలకు చెందిన పెండింగ్ వర్క్‌ను అత్యధికంగా హైదరాబాద్ కంపెనీలు పంచుకుంటుండగా మరికొన్ని పనులు పుణె, చెన్నై, ఢిల్లీల్లోని కంపెనీలు పంచుకుంటున్నాయి. ఇదిలా ఉండగా, గతంలో చెన్నైని వరదలు చుట్టుముట్టిన సమయంలో హైదరాబాద్ టెక్కీలు రంగంలోకి దిగారు.












Click it and Unblock the Notifications