కాళేశ్వరం అవినీతిపై సీబీఐ విచారణకు సిద్ధం..కానీ షాకింగ్ ట్విస్ట్ ఏంటంటే!!
తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించింది అని చెప్పుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందని ఇప్పటికే ప్రస్తుత ప్రభుత్వం ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపై దర్యాప్తు చేయాలని ఫిర్యాదు చేసిన సిబిఐ నుంచి స్పందన లేదని పేర్కొంటూ న్యాయవాది రామ్మోహన్ రెడ్డి హైకోర్టులో వేసిన పిటిషన్ పై నేడు కోర్టులో విచారణ జరిగింది.
దీనిపై సిబిఐ హైదరాబాద్ విభాగం హెడ్, ఐపీఎస్ అధికారి డి కళ్యాణ చక్రవర్తి కోర్టులో కౌంటర్ దాఖలు చేశారు . కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం లోని అక్రమాలపై దర్యాప్తుకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఇప్పటివరకు ప్రభుత్వం నుండి తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని, కాళేశ్వరం ప్రాజెక్టుకు నిధులు రుణాలుగా ఇచ్చిన బ్యాంకుల కన్సార్షియం నుండి కూడా ఎటువంటి ఫిర్యాదులు అందలేదని సిబిఐ దాఖలు చేసిన కౌంటర్లో పేర్కొంది.

కాళేశ్వరం లో అవినీతి జరిగిందన్న ఆరోపణలపై నేరుగా దర్యాప్తు చేసే అంశంపై సిబిఐకి పరిమితులు ఉన్నాయని, దానిని దృష్టిలో పెట్టుకొని ఫిర్యాదులపై స్పందించలేదని పేర్కొంది. పిటిషనర్ పంపించిన ఫిర్యాదు పై పరిశీలన జరుపుతున్నామని ఈ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, రాష్ట్ర ప్రభుత్వ పాత్ర ఏమిటి అనేది తెలియాల్సి ఉందని తెలిపారు.కేవలం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పాత్రే ఉంటే తామేమీ చేయలేమని పేర్కొంది.
రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు తమకు ఎలాంటి సమాచారం లేదని ఉత్తర ప్రత్యుత్తరాలు కూడా జరగలేదని సిబిఐ హైకోర్టు దృష్టికి తీసుకువెళ్లింది. హైకోర్టు లేదా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశిస్తే దర్యాప్తు చేస్తామని పేర్కొన్న సిబిఐ దర్యాప్తుకు కావలసిన వనరులు, సౌకర్యాలు ప్రభుత్వం కల్పించాలని పేర్కొంది.
అదనపు ఎస్పీ, ముగ్గురు డిఎస్పీలు, ఆరుగురు ఇన్స్పెక్టర్లు, నలుగురు ఎస్ఐలతో పాటు సిబ్బంది కావాలని కోర్టు దృష్టికి తీసుకు వెళ్ళింది. సీబీఐ దాఖలు చేసిన కౌంటర్ ని పరిశీలించిన న్యాయస్థానం ఫిబ్రవరి 2వ తేదీన మరోమారు విచారణ చేస్తామని కేసును ఆ రోజుకు వాయిదా వేసింది.












Click it and Unblock the Notifications