అచ్చు సినిమా క్లైమాక్స్ లాగే.. : సీసీఎస్ పోలీసా..! మజాకా..!
హైదరాబాద్ : తీసుకున్న కాంట్రాక్టులను బాధ్యాతాయుతంగా నిర్వహించాల్సింది పోయి.. సొంత లావాదేవీలను చక్కదిద్దుకోవడం కోసం కాంట్రాక్టు ఇచ్చిన సంస్థకే కన్నం పెట్టి, కోట్ల రూపాయల గోల్ మాల్ కి పాల్పడిన ఆర్సీఐ సంస్థ అధికారులు ఇప్పుడు ఊచలు లెక్కపెడుతున్నారు. కేసు విషయంలో చాకచక్యంగా వ్యవహరించిన హైదరాబాద్ పోలీసులు కేసులో ప్రధాన నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
ఆర్సీఐ క్యాష్ మేనేజ్ మెంట్ అనే సంస్థ ఎఫ్‌ఎస్‌ఎస్ సంస్థ నుంచి ఎస్.బీ.ఐ ఏటీఎంలలో క్యాష్ నింపేందుకు గాను సబ్-కాంట్రాక్ట్ పొందింది. ఆర్సీఐ హైదరాబాద్ బ్రాంచ్ కి సుదీప్ కుమార్, పవన్ కుమార్ గుప్తా డైరెక్టర్లుగా వ్యవహరిస్తున్నారు. కాంట్రాక్టు ప్రకారం నగరంలోని 116 చోట్ల ఉన్న ఏటీఎం లలో డబ్బును నింపాల్సిన బాధ్యత ఆర్సీఐ సంస్థపై ఉంది.
అయితే డబ్బు నింపే విషయంలో అవకతవకలకు పాల్పడిన ఆర్సీఐ యాజామాన్యం, ఏటీఎం లలో నింపాల్సిన డబ్బును తమ సూట్ కేసుల్లో నింపుకోవడం మొదలుపెట్టింది. కాంట్రాక్టు తీసుకునే నాటికే ఆర్థిక ఇబ్బందులతో సతమవుతున్న ఆర్సీఐ తమ ఉద్యోగులకు వేతనాలు కూడా చెల్లించలేని స్థితిలో కంపెనీని నెట్టుకొస్తోంది. ఇలాంటి సమయంలో ఎస్.బీ.ఐ కాంట్రాక్టు రావడంతో ఇదే అదునుగా భావించిన యాజమాన్యం ఏటీఎం కేంద్రాల్లో పెట్టాల్సిన రూ.2.15 కోట్ల డబ్బును గోల్ మాల్ చేసింది.
యాజామాన్యం అవకతవకలను ఆసరాగా చేసుకుని ఏటీఎంలలో డబ్బు నింపే ఆర్సీఐ ఆపరేషన్స్ మేనేజర్, కస్టోడియన్స్ కూడా రూ.7.83 కోట్లను గోల్ మాల్ చేశారు. మహేంద్రాహిల్స్ త్రిమూర్తి కాలనీ కేంద్రంగా పనిచేస్తోన్న ఆర్సీఐలో జి.నాగరాజు ఆపరేషన్స్ విభాగం మేనేజర్‌గా, కె.లోకేశ్వర్‌రెడ్డి, కర్రె అజయ్‌కుమార్, జి.ప్రవీణ్‌కుమార్, ఆర్.పండు, నర్సింగ్‌రావుల్ని కస్టోడియన్లుగా విధులు నిర్విస్తున్నారు.

పక్కా ప్లాన్ తో నిందితుడికి గాలం వేసిన సీసీఎస్ పోలీసులు :
కేసుకు సంబంధించి గత నెలలోనే 8 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేయగా, తప్పించుకు తిరుగుతున్న మరో ఇద్దరు నిందితులు సుదీప్, గిరిరాజ్ కోసం పోలీసులు వేట మొదలుపెట్టారు. ఈ క్రమంలో ముంబైలో వీరిద్దరు తలదాచుకున్నట్టు పోలీస్ వర్గాలకు సమాచారం అందడంతో ఏసీపీ జోగయ్య, ఇన్ స్పెక్టర్ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో ఓ ప్రత్యేక బృందం ముంబైలో అడుగుపెట్టింది.
నిందితుల కోసం ఐదు రోజుల పాటు పక్కా నిఘా పెట్టిన పోలీసులు ఎట్టకేలకు నిందితుల ఆచూకీ గుర్తించారు. ఆర్సీఐ సంస్థలోనే పనిచేసిన ఓ మాజీ ఉద్యోగిని ఇంట్లోనే నిందితుడు సుదీప్ కుమార్ తలదాచుకున్నట్టు గుర్తించిన పోలీసులు.. గురువారం నాడు ఆ అపార్ట్ మెంట్ ని రౌండప్ చేశారు. అంతకు ముందు ఆ అపార్ట్ మెంట్ గుండా తప్పించుకునే అన్ని మార్గాలను గమనించిన పోలీసులు, తప్పించుకోవడానికి అవకాశం ఉన్న ప్రతి చోట పోలీసులను ఏర్పాటు చేశారు.
పక్కా ప్లాన్ తో పోలీసులు నిందితుడి ఫ్లాట్ తలుపు తట్టగా.. అప్రమత్తమైన నిందితుడు తలుపు తీయకపోగా, తప్పించుకునే ప్రయత్నం చేశాడు. పోలీసులు తలుపులు బాదుతుండగానే తను ఉన్న ఫ్లాట్ నుంచి రెండో అంతస్తులోకి దూకేసిన సుదీప్, అక్కడినుంచి మొదటి అంతస్తుకు, అక్కడి నుంచి వెనుక వైపు గోడ ద్వారా తప్పించుకునేందుకు యత్నించాడు.
అయితే అప్పటికే అక్కడ పోలీసులు మాటు వేయడంతో సుదీప్ పోలీసుల చేతికి చిక్కక తప్పలేదు. ఇక పట్టుబడ్డ తర్వాత సుదీప్ ఇచ్చిన సమాచారంతో మరో నిందితుడు గిరి రాజ్ ను కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
శుక్రవారం నాడు నిందితులు ఇద్దర్ని ముంబై కోర్టులో హాజరుపర్చిన సీసీఎస్ పోలీసులు అనంతరం వారెంట్ పై ఇద్దరినీ హైదరాబాద్ కి తీసుకొచ్చారు. ఆ తర్వాత వైద్య పరీక్షల నిమిత్తం గిరిరాజ్ ని కోర్టులో హాజరుపరిచిన పోలీసులు అనంతరం అతన్ని రిమాండ్ కి తరలించారు. మరో నిందితుడు సుదీప్ ని న్యాయస్థానంలో హాజరుపరిచేందుకు ఇంకా గడువు మిగిలే ఉండడంతో, అతని నుంచి మరిన్ని వివరాలు సేకరించే పనిలో పడ్డారు పోలీసులు.












Click it and Unblock the Notifications