రేషన్ కార్డు లబ్దిదారులకు కేంద్రం శుభవార్త.. మూడునెలల రేషన్ ఒకేసారి!
సామాన్య ప్రజలకు కేంద్రం శుభవార్త చెప్పింది. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలకు చేరే రేషన్ బియ్యాన్ని వచ్చే వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని ఒకేసారి ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. జూన్, జూలై మరియు ఆగస్టు నెలలకు ఇవ్వవలసిన రేషన్ బియ్యాన్ని మే 21వ తేదీ నుంచి ఓకే దశలో అందజేయాలన్న కేంద్రం ఆదేశాలతో సివిల్ సప్లైస్ అధికారులు పరుగులు పెడుతున్నారు.
అన్ని రాష్ట్రాల్లో మూడు నెలల రేషన్ ఒకేసారి
వర్షాకాలంలో రేషన్ రవాణా ఇబ్బందికరంగా మారుతున్న పరిస్థితులలో, అన్ని రాష్ట్రాల్లో మూడు నెలల రేషన్ ఒకేసారి ఇవ్వాలని, వర్షాకాలం ముందే ఈ చర్య తీసుకుంటున్నట్టు మే 10వ తారీకు జారీ చేసిన ఉత్తర్వులలో పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల సివిల్ సప్లై అధికారులకు ఆహార ప్రజాపంపిణీ మంత్రిత్వ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రాహుల్ సింగ్ ఈ మేరకు లేఖ రాసారు.

సన్న బియ్యం పంపిణీ కోసం యుద్ధ ప్రాతిపదికన సన్నాహాలు
మే 31వ తేదీలోగా లబ్ధిదారులకు రేషన్ అందించాలని ఇందుకోసం ముందస్తుగా బియ్యం లిఫ్టింగ్ చేయాలని, ఎఫ్సీఐ గోడౌన్లలో తగినంత నిల్వలు ఉండేలా చూసుకోవాలని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ లబ్ధిదారులకు ఇబ్బంది కలగకుండా రేషన్ పంపిణీ చేసే అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా రేషన్ లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ కోసం యుద్ధ ప్రాతిపదికన సన్నాహాలు చేస్తుంది.
జూన్ నెలలో మూడు నెలల రేషన్ ఒకేసారి
ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో సామాన్య ప్రజలకు, తెల్ల రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం మే నెలలో ఇవ్వాల్సిన రేషన్ కోటాను ఇచ్చేసింది. ఇక జూన్ లో మూడు నెలల కోటాను ఒకటేసారి విడుదల చేస్తామని రాష్ట్రప్రభుత్వం కేంద్రప్రభుత్వానికి చెప్పినట్టు సమాచారం. ఈ మేరకు సివిల్ సప్లై అధికారులు సన్న బియ్యాన్ని సమకూర్చుకోవడానికి, మూడు నెలల రేషన్ ఒకేసారి పంపిణీ చేయడానికి అవసరమైన కసరత్తులు చేస్తున్నారు.
మూడునెలల సన్నబియ్యం సేకరణకు కసరత్తు
ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా స్టేజి 1, స్టేజ్ 2గోదాములలో బియ్యం నిల్వలు ఎన్ని ఉన్నాయి అన్న దానిపైన వివరాలను సేకరిస్తున్నారు. ఆ వివరాల ఆధారంగా జూన్, జూలై, ఆగస్టు నెలలకు పంపిణీ చేయవలసిన సన్నబియ్యం ఇంకా ఎంత అవసరం అవుతాయి అన్నది లెక్క చేస్తున్నారు. ఇక సన్న బియ్యం సేకరణకు రాష్ట్రంలో సన్నబియ్యం తాలూకు వడ్ల మిల్లింగ్ వేగవంతం చేయాలని సివిల్ సప్లై అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
కేంద్ర నిర్ణయం తెలంగాణా ప్రజలకు శుభవార్త
ప్రతినెల రాష్ట్రవ్యాప్తంగా 1.75 లక్షల టన్నుల బియ్యం అవసరం అవుతుండగా, మూడు నెలలకు ఒకేసారి రేషన్ పంపిణీ చేయడానికి 5.25 లక్షల టన్నుల బియ్యం అవసరమవుతాయని లెక్కించారు. ఈ బియ్యాన్ని సమకూర్చుకొని మూడు నెలల రేషన్ ఒకేసారి పంపిణీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇక వర్షాకాలంలో రవాణా విషయంలో ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం సామాన్య ప్రజలకు కూడా శుభవార్త గానే చెప్పాలి.
లబ్దిదారులకు కేంద్ర నిర్ణయంతో ఆ కష్టానికి చెక్
ప్రతిసారి రేషన్ తీసుకోవడానికి రేషన్ షాపుల ముందు క్యూలో నిలబడే కష్టాలు మూడు నెలలకు ఒకేసారి ఇస్తే కొద్దిగా తగ్గినట్టు అవుతాయి. మే 10వ తేదీన కేంద్రం తీసుకున్న నిర్ణయం యుద్ధ నేపథ్యంలోని అందరు భావించిన క్రమంలో, వర్షాకాలం నేపథ్యంలో అని తాజా పరిణామాలతో అర్థమవుతుంది.












Click it and Unblock the Notifications