రేవంత్ సర్కారుకు గుడ్‌న్యూస్: ఎలివేటేడ్ కారిడార్లకు కేంద్రం అనుమతి
హైదరాబాద్-కరీంనగర్ రాజీవ్ రహదారితో పాటు హైదరాబాద్ నాగ్‌పూర్ జాతీయ రహదారిపై ఎలివేటేడ్ కారిడార్ నిర్మాణానికి అనుమతి ఇచ్చింది కేంద్ర రక్షణ శాఖ.
హైదరాబాద్ లోని డిఫెన్స్ భూముల మీదుగా ఎలివేటేడ్ కారిడార్ల నిర్మాణానికి లైన్ క్లియర్ అయింది.
ఇటీవలే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ను కలిసి డిఫెన్స్ భూముల మీదుగా ఎలివేటేడ్ కారిడార్ల నిర్మాణానికి అనుమతించాలని లేఖను అందించారు. స్పందించిన కేంద్ర ప్రభుత్వం ఎలివేటేడ్ కారిడార్ల నిర్మాణానికి శుక్రవారం ఉదయం అనుమతులు జారీ చేసింది.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ప్రధాని నరేంద్రమోడీకి, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, రక్షణ శాఖ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఎనిమిదేండ్లుగా అపరిష్కృతంగా ఉన్న ఈ సమస్యకు పరిష్కారం లభించటంతో ఉత్తర తెలంగాణ దిశగా రవాణా మార్గాల అభివృద్ధికి మార్గం సుగమమైంది,హైదరాబాద్ నుంచి శామీర్‌పేట, హైదరాబాద్ నుంచి మేడ్చల్ దిశగా ట్రాఫిక్ ఇబ్బందులు తొలిగిపోనున్నాయి.
కాగా, హైదరాబాద్ నుంచి కరీంనగర్-రామగుండం పట్టణాలను కలిపే రాజీవ్ రహదారిలో ప్యారడైజ్ జంక్షన్ నుంచి ఔటర్ రింగ్ రోడ్డు జంక్షన్ వరకు 6 లేన్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం, ఎంట్రీ, ఎగ్జిట్ ర్యాంపుల నిర్మాణానికి మొత్తంగా 11.30 కిలోమీటర్ల కారిడార్ నిర్మాణానికి 83 ఎకరాల భూమి అవసరమని రక్షణ శాఖ మంత్రికి సీఎం రేవంత్ విజ్ఙప్తి చేశారు.
నాగ్‌పూర్ హైవే (ఎన్‌హెచ్-44)పై కండ్లకోయ సమీపంలోని ప్యారడైజ్ జంక్షన్ నుంచి ఔటర్ రింగ్ రోడ్డు వరకు ఎలివేటెడ్ కారిడార్ మొత్తంగా 18.30 కిలోమీటర్ల మేర ప్రతిపాదించామని, ఇందులో 12.68 కిలోమీటర్ల మేర ఆరు లేన్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి, నాలుగు ప్రాంతాల్లో ఎగ్జిట్, ఎంట్రీలకు, భవిష్యత్తులో డబుల్ డెక్కర్ (మెట్రో కోసం) కారిడార్, ఇతర నిర్మాణాలకు మొత్తంగా 56 ఎకరాల రక్షణ శాఖ భూములు బదిలీ చేయాలని రక్షణ శాఖ మంత్రికి ముఖ్యమంత్రి విజ్ఙప్తి చేశారు. ఈ ప్రతిపాదనలకు ఇప్పుడు కేంద్రం అనుమతులు ఇవ్వడంతో ఉత్తర తెలంగాణ దిశగా రవాణా మార్గాల అభివృద్ధికి మార్గం సుగమమైంది. మరోవైపు, నిజామాబాద్, ఆదిలాబాద్, ఇటు కరీంనగర్ రామగుండం వెళ్లేందుకు సికింద్రాబాద్ ఏరియాలోని అత్యంత ఇబ్బందికరంగా మారిన ట్రాఫిక్ సమస్య తొలిగిపోనుంది.












Click it and Unblock the Notifications