చేసింది మొత్తం కేటీఆరే.. సినీ నటులు కూడా ఉన్నారు
తెలంగాణ రాజకీయాలను ఫోన్ ట్యాపింగ్ అంశం కుదిపేస్తోంది. తాజాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలోనే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని, దీనిపై ఉన్నతస్థాయి దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. మాజీమంత్రి కేటీఆర్ పర్యవేక్షణలో ట్యాపింగ్ జరిగిందని మంత్రి ఆరోపించారు. బాధితుల్లో రాజకీయ నాయకులే కాదని, సినీ నటులు, వ్యాపారస్తులు కూడా ఉన్నారన్నారు. బ్లాక్ మెయిల్ చేసి వారి నుంచి డబ్బులు వసూలు చేయడానికే ఫోన్ ట్యాపింగ్ చేశారని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.
దుబ్బాక, హుజురాబాద్, మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను దెబ్బ తీయడానికి కూడా ఫోన్ ట్యాపింగ్ చేశారని, అసెంబ్లీ ఎన్నికల సమయంలో డబ్బులు పంపిణీ చేసినట్లు విచారణలో పోలీసులు ఒప్పుకున్నారని, పోలీసులపై పోలీసులే చర్యలు తీసుకోవడం కష్టమన్నారు. నిందితులు కేసును ప్రభావితం చేసే అవకాశం ఉందని కిషన్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. తెలంగాణ పోలీసులు దర్యాప్తు చేస్తే ఈ కేసులో న్యాయం జరగదన్నారు. కిషన్ రెడ్డి తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, నార్కో పరీక్షకు కూడా సిద్ధమని కేటీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా కిషన్ రెడ్డి మొత్తం వ్యవహారానికి కేటీఆర్ కారణమని వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్ గా మారింది.

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇంటిలిజెన్స్ మాజీ ఐజీ ప్రభాకర్ రావు కూడా నిందితుడేనని పోలీసులు భావించారు. అయితే అతను చికిత్స కోసం అమెరికాలో ఉన్నానని, జూన్ లో తిరిగివస్తానని రాయబారం పంపారు. లుక్ ఔట్ నోటీసు జారీచేస్తామనడంతో దుబాయ్ వచ్చి అక్కడ వారంరోజులు ఉండి తాజాగా హైదరాబాద్ వచ్చినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications