'బాబుకు కేంద్రమంత్రులు నో, అరెస్ట్ చేస్తే ప్రభుత్వం కూలుతుందా?'
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి బుధవారం నాడు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పైన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబుకు కేంద్రమంత్రులు అపాయింటుమెంట్ ఇవ్వడం లేదన్నారు.
విచారణ జరుగుతుండగానే చంద్రబాబు ఆరోపణలు చేయడం ఏమాత్రం సరికాదన్నారు. గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్న చందంగా చంద్రబాబు తీరు ఉందన్నారు. చంద్రబాబును అరెస్టు చేస్తే తెలంగాణ ప్రభుత్వం పడిపోతుందని హెచ్చరించడం అర్థరహితమన్నారు.
తమది ప్రజా ప్రభుత్వమని, చంద్రబాబు నాయుడు నామినేట్ చేసిన ప్రభుత్వం కాదని చెప్పారు. ఓటుకు నోటు వ్యవహారంలో విచారణ జరుగుతుండగా ఆరోపణలు వద్దన్నారు.

నోరు అదుపులో పెట్టుకో: బాల్క సుమన్
చంద్రబాబు ఇప్పటికైనా తన తప్పును ఒప్పుకోవాలని తెరాస పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ అన్నారు. చంద్రబాబు నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. స్టీఫెన్ సన్ ఇంట్లో మీ ఎమ్మెల్యే దొరకలేదా అని ప్రశ్నించారు.
ఓటుకు నోటు కేసులో నైతిక బాధ్యత వహిస్తూ బాబు సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ఆ ఆడియో మీది కాదనప్పుడు ఫొరెన్సిక్ ల్యాబ్‌కు పంపాలని ఎందుకు డిమాండ్ చేయడం లేదని ప్రశ్నించారు.
చీమలు పెట్టిన పుట్టల్లోకి పాములు వచ్చినట్లు టీడీపీలోకి నువ్వొచ్చావని, మామకు వెన్నుపోటు పొడిచి కుర్చీని లాక్కున్నావని మండిపడ్డారు. ఏపీ అవినీతి సొమ్ముతో తెలంగాణలో కుట్రలు చేస్తున్నావన్నారు. చంద్రబాబు విచారణకు సహకరించాలన్నారు.
సైఫాబాద్‌లో బాబుపై ఫిర్యాదు
సైఫాబాద్ పోలీసు స్టేషన్‌లో చంద్రబాబుపై ఫిర్యాదు నమోదయింది. ఓటుకు నోటు వ్యవహారంలో చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని, బాబు వ్యాఖ్యలతో తెలుగు ప్రజల మనోభావాలు దెబ్బతినేలా ఉన్నాయని, చర్యలు తీసుకోవాలని న్యాయవాది శ్రీరంగరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు.












Click it and Unblock the Notifications