మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో లోపం లేదు కానీ, అక్కడే సమస్య: ఈఎన్సీ మురళీధరన్
హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ బ్యారేజీ ((Medigadda Barrage) నిర్మాణంలో లోపాలు లేవని నీటి పారుదల శాఖ జనరల్ ఈఎన్సీ మురళీధరన్ అన్నారు. అయితే, ఎక్కడో చిన్న పొరపాటు అయితే జరిగిందని తెలిపారు. ఏడో బ్లాక్లో సమస్య వల్ల సెంటర్ పిల్లర్ కుంగిందని వెల్లడించారు. ఇసుక వల్ల సమస్య వచ్చిందని అనుకుంటున్నామని అనుమానం వ్యక్తం చేశారు.
క్వాలిటీ ఆఫ్ సాండ్, క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ అనుమతులు ఉన్నాయన్నారు మురళీధరన్. కాపర్ డ్యాంకు వరద తగ్గాక నవంబరు చివరలో సమగ్ర పరిశీలన జరుపుతామని ఈఎన్సీ మురళీధరన్ తెలిపారు.

ఇంజనీర్లతో కేంద్ర బృందం సమావేశం :
మేడిగడ్డ ఆనకట్ట అంశంపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ.. రాష్ట్ర నీటిపారుదల శాఖ ఇంజినీర్లతో సమావేశమైంది. కేంద్ర జల సంఘం చీఫ్ ఇంజినీర్ అనిల్ జైన్ నేతృత్వంలోని బృందం హైదరాబాద్ జలసౌధలో ఇంజినీర్లతో సమావేశమైంది. ఈ సమావేశంలో నీటి పారుదల శాఖ జనరల్ ఈఎన్సీ మురళీధరన్, ఓ అండ్ ఎం ఈఎన్సీ నాగేందర్ రావు, కాళేశ్వరం ఈఎన్సీ వెంకటేశ్వర్లు, ముఖ్యమంత్రి ఓఎస్డీ శ్రీధర్ దేశ్ పాండే, ఇంజినీర్లు, ఎల్ అండ్ టీ సంస్థ ప్రతినిధులు సమావేశంలో పాల్గొన్నారు.
కాగా, మేడిగడ్డ బ్యారేజీ కుంగిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇంజినీర్ల కమిటీ.. మంగళవారం క్షేత్రస్థాయిలో పర్యటించింది. మేడిగడ్డ ఆనకట్ట, కుంగిన ప్రాంతాన్ని పరిశీలించి ఇంజనీర్ల ద్వారా వివరాలు తెలుసుకున్నారు. బుధవారం హైదరాబాద్లో రాష్ట్ర ఇంజినీర్లతో సమావేశమయ్యారు. ఆనకట్టకు సంబంధించిన నిర్మాణ ప్రక్రియ, తీసుకున్న జాగ్రత్తలు, సాంకేతిక అంశాలు, కుంగిపోవడానికి గల కారణాలు సహా అనేక అంశాలపై చర్చించారు. క్షేత్రస్థాయి పరిశీలన, ఇంజినీర్ల సమావేశం ఆధారంగా కేంద్ర బృందం త్వరలో నివేదిక సమర్పించనుంది.












Click it and Unblock the Notifications