టీఆర్ఎస్-బీజేపీ ఢీ: వరద రాజకీయం: కేటీఆర్‌కు కౌంటర్: 8 ఏళ్లల్లో రూ.3,000 కోట్లు: ఏం చేశారు?
హైదరాబాద్: గోదావరికి సంభవించిన వరదల వెనుక క్లౌడ్ బరస్ట్ కుట్ర దాగి ఉందంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు చేసిన వ్యాఖ్యలు దుమారం చల్లారకముందే- మరో వివాదం తెర మీదికి వచ్చింది. క్లౌడ్ బరస్ట్ వ్యాఖ్యలపై కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ తెలంగాణ నాయకులు ప్రభుత్వంపై ఎదురుదాడికి దిగారు. వరద సహాయక చర్యల్లో విఫలం కావడం వల్లే కేసీఆర్ ఈ కుట్ర ఆరోపణలను తెర మీదికి తెచ్చారంటూ మండిపడుతోన్నారు.

విపత్తు నిర్వహణ నిధులపై..
దీనిపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కూడా స్పందించిన విషయం తెలిసిందే. పుదుచ్చేరి పరిధిలోకి వచ్చే యానాంలో లెప్టినెంట్ గవర్నర్ హోదాలో పర్యటించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు సంధించారు. యానాంలో క్లౌడ్ బరస్ట్‌కు చోటు లేదంటూ కేసీఆర్‌కు చురకలు అంటించారు. ఇదిలా కొనసాగుతుండగానే- తెలంగాణకు విడుదల చేసిన విపత్తు నిర్వహణ నిధుల వ్యవహారంలో మరోసారి వాగ్యుద్ధం చోటు చేసుకుంది.

కేంద్రం వివక్ష..
తెలంగాణలో ప్రతి సంవత్సరం వరదలు సంభవిస్తోన్నాయని, వేలాది హెక్టార్లల్లో పంట నీటిపాలవుతోందని, అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం విపత్తు నిర్వహణ నిధులను మంజూరు చేయట్లేదంటూ టీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. సబ్ కా సాథ్, సబ్ కా వికాస్ అని ఒకవంక చెబుతూనే, బీజేపీయేతర పాలిత రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపిస్తోందంటూ కేటీఆర్ విమర్శించారు. 2018 నుంచి నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ కింద ఒక్క రూపాయి కూడా రాలేదంటూ మండిపడ్డారు.
రాష్ట్రాలవారీగా లెక్కలు..
2020లో హైదరాబాద్‌లో సంభవించిన వరదల పట్ల కేంద్ర ప్రభుత్వం స్పందించలేదని, ఇప్పుడు తాజాగా గోదావరి నదికి వచ్చిన వరదలపైనా ఎందుకు సహాయ నిధులను ప్రకటించట్లేదంటూ కేటీఆర్ నిలదీశారు. 2018-2022 మధ్యకాలంలో నిధులు పొందిన రాష్ట్రాల జాబితాను ఆయన విడుదల చేశారు. హిమాచల్ ప్రదేశ్-రూ.748.25 కోట్లు, సిక్కిం-రూ.184.02 కోట్లు, అరుణాచల్ ప్రదేశ్-191.83 కోట్లు, గుజరాత్-రూ.1,000 కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు.

రూ.3,000 కోట్లు ఇచ్చాం..
అలాగే మధ్యప్రదేశ్-రూ.4,538.43 కోట్లు, మహారాష్ట్ర-రూ.8,754.5 కోట్లు, కర్ణాటక-రూ.6,480.69 కోట్లు విడుదల చేసినట్లు కేటీఆర్ వివరించారు. దీనిపై తాజాగా కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జీ కిషన్ రెడ్డి స్పందించారు. కేటీఆర్ చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని చెప్పారు. కేంద్రంలో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం ఈ ఎనిమిది సంవత్సరాల కాలంలో తెలంగాణకు 3,000 కోట్ల రూపాయలను మంజూరు చేశామని అన్నారు. 2018 నుంచి ఇప్పటివరకు 1,500 కోట్ల రూపాయలను విడుదల చేసినట్లు చెప్పారు.

వైఫల్యం వల్లే..
దీనికి సంబంధించిన వివరాలను కిషన్ రెడ్డి వెల్లడించారు. వాస్తవ పరిస్థితులను దాచి పెట్టి, తప్పుడు వార్తలను టీఆర్ఎస్ నాయకులు ప్రచారం చేస్తోన్నారని విమర్శించారు. వరద సహాయక చర్యల్లో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందని ధ్వజమెత్తారు. తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికే క్లౌడ్ బరస్ట్ కుట్ర అంటూ ఆరోపణలు చేసిందని ఎదురుదాడికి దిగారు. ఇప్పుడు తాజాగా ఎన్డీఆర్ఎఫ్ నిధుల విషయాన్ని తెర మీదికి తీసుకొచ్చిందని అన్నారు.












Click it and Unblock the Notifications