కెసిఆర్‌పై చంద్రబాబు మెతక వైఖరి: ఆందోళనలో టిడిపి?
హైదరాబాద్: నోటుకు ఓటు కేసు వెలుగు చూసిన నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరస్పరం కత్తులు దూసుకున్నారు. ఇప్పుడు మంచి మిత్రులుగా మారినట్లు కనిపిస్తున్నారు. ఇందులోని మతలబు ఏమిటనేది ఎవరికి వారు ఊహించుకుంటున్నప్పటికీ బహిరంగంగా మాట్లాడలేకపోతున్నారు.
బద్దశత్రువులైన కెసిఆర్, చంద్రబాబు మిత్రులుగా మారడానికి వెనక గల కారణమేమిటని ఎఐసిసి ప్రధాన కార్యదర్సి దిగ్విజయ్ సింగ్ తన హైదరాబాద్ పర్యటనలో గురువారం ప్రశ్నించారు. నోటుకు ఓటు కేసు వెలుగు చూసినప్పుడు ఇరువురు ముఖ్యమంత్రులు కోడి పుంజుల్లా కలబడ్డారని, ఇప్పుడు మిత్రులుగా మారి పరస్పరం అభినందించుకుంటున్నారని, కేసులను మాత్రం గాలికి వదిలేశారని ఆయన అన్నారు.

దిగ్విజయ్ సింగ్ చెప్పిన విషయమే అంతటా ప్రచారంలో ఉన్నప్పటికీ ఎవరు కూడా బయటకు మాట్లాడడం లేదు. బిజెపి, టిడిపి కూటమి జిహెచ్ఎంసి ఎన్నికల శంఖారావం పూరిస్తూ ఇటీవల హైదరాబాదులోని నిజాం కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొన్నారు గానీ కెసిఆర్‌ను పల్లెత్తు మాట అనలేదు.
తాను హైదరాబాదు అభివృద్ధికి ఎలా కృష్టి చేసిందీ చెప్పారు. కానీ, ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వ పనితీరుపై గానీ, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ తీరుపై గానీ ఏ విధమైన వ్యతిరేక వ్యాఖ్యలు కూడా చేయలేదు. సభలో ప్రసంగించిన పార్టీ తెలంగాణ శాసనసభ్యులు రేవంత్ రెడ్డి, ఆర్. కృష్ణయ్య, చంద్రబాబు తనయుడు నారా లోకేష్ మాత్రం కెసిఆర్‌పై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.
చంద్రబాబు కెసిఆర్‌ను విమర్శించకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం కాగా, తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రం ఆందోళనకు గురువుతున్నట్లు సమాచారం. కెసిఆర్‌పై చంద్రబాబు విమర్శలు చేయకపోవడంతో తమ పార్టీలో పోరాట పటిమ నశించిందనే సంకేతాలు వెళ్తున్నాయని వారంటున్నారు. అదే సమయంలో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ కూడా కెసిఆర్‌పై విమర్శలు చేయలేదు. కానీ, బిజెపి రాష్ట్రాధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి విమర్శనాస్త్రాలు సంధించారు.
కెసిఆర్ పట్ల అనుసరించాల్సిన వైఖరి విషయంలో తెలుగుదేశం, బిజెపి అగ్ర నాయకత్వం ఒక దారిలో నడుస్తుండగా, రాష్ట్ర స్థాయి నాయకత్వం మరోదారిలో నడుస్తున్నట్లు స్పష్టంగా వెల్లడైందని అంటున్నారు. దీన్ని కాంగ్రెసు పార్టీ జిహెచ్ఎంసి ఎన్నికల్లో అవకాశంగా మలుచుకోవాలని ప్రయత్నాలు చేస్తోంది.












Click it and Unblock the Notifications