మనందరికీ గొప్పే, అందుకే కెసిఆర్ ఇంటికి: బాబు, సోనియా గాంధీకి..
విజయవాడ: ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపనకు ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ సహా అన్ని పార్టీల అధ్యక్షులను పిలవాలని ఏపీ కేబినెట్ శనివారం నిర్ణయించింది. అన్ని రాష్ట్రాల సీఎంలు, గవర్నర్లు, సభాపతులు, ప్రతిపక్ష నేతలను, పారిశ్రామికవేత్తలను ఆహ్వానించాలని నిర్ణయించారు.
అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి తెలంగాణ సీఎం కెసిఆర్‌ను తాను స్వయంగా ఆహ్వానిస్తానని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. శనివారం విజయవాడలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో రాజధాని శంకుస్థాపనపై చర్చ జరిగింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగువారందరికీ ఇది ప్రతిష్ఠాత్మక కార్యక్రమమని, అందుకే కేసీఆర్ ఇంటికెళ్లి ఆహ్వాన పత్రిక ఇస్తానని తెలిపారు. గవర్నర్, ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను కూడా తానే వెళ్లి ఆహ్వానిస్తానని చెప్పారు.

తెలంగాణలో ఉన్న అన్ని పార్టీల అధ్యక్షులు, ప్రతిపక్ష నేతలు, మంత్రులకు ఆహ్వానం ఇవ్వాలని సూచించారు. వీలైతే వారికి కూడా తానే వెళ్లి ఇస్తానని, లేదంటే మంత్రులు వెళ్లి అందరినీ ఆహ్వానించాలని కోరారు. దేశంలోని అన్ని రాష్ట్రాల గవర్నర్లు, సీఎంలు, ప్రతిపక్ష నేతలు, సభాపతులను ఆహ్వానించాలన్నారు.
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో సహా అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులు, కేంద్రమంత్రులను ఆహ్వానించాలన్నారు. ఆ బాధ్యతను పార్టీకి చెందిన కేంద్ర మంత్రులు, ఎంపీలు తీసుకుంటారన్నారు. రాష్ట్ర మంత్రులు కూడా బృందాలుగా ఏర్పడి అందరినీ ఆహ్వానించాలన్నారు.
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చిన, చర్చలు జరుపుతున్న కంపెనీల సీఈవోలందరికీ ఆహ్వానం పంపాలని నిర్ణయించారు. మొత్తంగా వీఐపీలే నాలుగువేల మంది వరకు ఉంటారని అధికారులు చెప్పగా, అంతమందికీ తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
మంత్రులు శంకుస్థాపనకు రాలేకున్నా ఫర్వాలేదని, వీఐపీలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బాధ్యత తీసుకోవాలన్నారు. చంద్రబాబు ఈ నెల 18న హైదరాబాద్ రానున్నారని, ఆ రోజున అందుబాటులో ఉన్న వారికి ఆయన ఆహ్వానాలు ఇచ్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది.
పుష్కరాల సందర్భంగా రాజమండ్రిలో తొక్కిసలాట జరిగి దుర్ఘటనకు దారితీసిందని, రాజధాని శంకుస్థాపన సందర్భంగా అలాంటి పరిస్థితి రాకుండా పోలీసులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. గతంలో భూమిపూజ కొందరు రైతులకు సరైన సౌకర్యాలు కల్పించలేదని, ఈసారి వారి గౌరవానికి భంగం కలగొద్దన్నారు.
శంకుస్థాపనకు రాష్ట్రంలోని అన్ని గ్రామాల నుంచి మట్టి, నీరుతో పాటు రాతపూర్వకంగా గ్రామాలు చేసిన రాజధాని సంకల్ప తీర్మానాలు కూడా తీసుకురావాలని సీఎం చంద్రబాబు సూచించారు. శంకుస్థాపన ప్రదేశంలో ఇండియా గేట్ తరహాలో ద్వారం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
ఆ ద్వారంపై అమరావతి స్థూపం ఆకారంలో నిర్మాణం చేయాలనుకున్నారు. గన్నవరం విమానాశ్రయానికి వచ్చే అతి ముఖ్యులను అక్కడి నుంచి హెలికాప్టర్ల ద్వారా శంకుస్థాపన ప్రాంతానికి తీసుకెళ్లేలా ఏర్పాట్లు చేయాలని చెప్పారు.
ప్రధాని నరేంద్ర మోడీ అమరావతిలో గంటన్నర సేపు ఉంటారని, ఆ తర్వాత తిరుపతి వెళ్తారని చెప్పారు. తాను తిరుపతి వరకు ఆయనతో వెళ్లి వీడ్కోలు చెప్తానన్నారు. మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబు మంత్రులందరికీ ఆహ్వాన పత్రికలు ఇచ్చారు.
పోలవరం ప్రాజెక్టుపై ప్రధానితో మాట్లాడానని, శంకుస్థాపనకు రమ్మన్నానని, అయితే ఒడిశా, చత్తీస్‌గఢ్‌ల నుంచి కొన్ని అభ్యంతరాలు ఉండడంతో రావడం వీలుకాదని చెప్పారని, కానీ మీ పని మీరు నిశ్శబ్దంగా చేసేసుకోండని ప్రధాని చెప్పారన్నారు. ఆ భరోసా చాలన్నారు.












Click it and Unblock the Notifications