రైతుల కన్నీరు తుడవండి: నడ్డాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినతి
తెలంగాణ రాష్ట్రానికి అవసరమైన యూరియాను సకాలంలో సరఫరా చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి జె.పి. నడ్డాను కోరారు. మంగళవారం ఢిల్లీలోని కేంద్ర మంత్రి అధికారిక నివాసంలో జరిగిన సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ విజ్ఞప్తి చేశారు.
యూరియా సరఫరాలో జాప్యం:
వానా కాలం సీజన్‌కు సంబంధించి ఏప్రిల్-జూన్ నెలల మధ్య 5 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా, కేవలం 3.07 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే సరఫరా చేశారని సీఎం నడ్డా దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రంలో ప్రాజెక్టులకు నీరు చేరి, సాగు పనులు జోరుగా సాగుతున్నందున యూరియా సరఫరాలో ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలని కోరారు.

రైల్వే రేకుల కొరతపై సీఎం ఆందోళన:
జులై నెలకు సంబంధించి 63 వేల మెట్రిక్ టన్నుల దేశీయ యూరియా, 97 వేల మెట్రిక్ టన్నుల దిగుమతి చేసుకున్న యూరియా రాష్ట్రానికి సరఫరా చేయాల్సి ఉండగా, ఇప్పటివరకు కేవలం 29 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే అందినట్లు సీఎం వివరించారు. దేశీయంగా ఉత్పత్తి అవుతున్న యూరియా కోటాను తెలంగాణకు పెంచాలని ఆయన విజ్ఞప్తి చేశారు. యూరియా సరఫరాకు రైల్వే శాఖ తగిన రేక్‌లు కేటాయించడం లేదని, వాటి సంఖ్య పెంచాలని కోరారు.
ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ క్రీడా సలహాదారు ఏపీ జితేందర్ రెడ్డి, ఎంపీలు డాక్టర్ మల్లు రవి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, కేంద్ర పథకాల సమన్వయ కార్యదర్శి డాక్టర్ గౌరవ్ ఉప్పల్ తదితరులు పాల్గొన్నారు. రైతులు యూరియా కొరతతో ఇబ్బంది పడకుండా చూడాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది.












Click it and Unblock the Notifications