త్వరలో బీజేపీయేతర సీఎంల సమావేశం : సీఎం కేసీఆర్ - సోరెన్ భేటీలో : రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ..!!
పార్టీ ప్లీనరీ వేదికగా జాతీయ రాజకీయాల్లో తన వైఖరి స్పష్టం చేసిన సీఎం కేసీఆర్..మరుసటి రోజునే మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ వచ్చిన జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో సుదర్ఘ భేటీ నిర్వహించారు. జాతీయ స్థాయిలో నెలకొన్న పరిస్థితులు..రాజకీయాలు..కేంద్రం తీరు పైన వీరిద్దరూ చర్చించారు. త్వరలోనే బీజేపీయేతర ముఖ్యమంత్రుల సమావేశం నిర్వహించాలని ఈ ఇద్దరి బేటీలో నిర్ణయించినట్లు సమాచారం.

బీజేపీయేతర సీఎంలు ఏకతాటి పైకి
కేంద్ర ప్రభుత్వం తమ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలకు ప్రాధాన్యత ఇస్తోందని..ఇతర పార్టీలు పాలిస్తున్న రాష్ట్రాలను ఇబ్బంది పెడుతోందని వారి చర్చల్లో అభిప్రాయం వ్యక్తం అయింది. ప్రాంతీయ పార్టీల ముఖ్యమంత్రులు ఏక తాటి పైకి వచ్చి కేంద్ర విధానాలను ఎదిరించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇదే సమయంలో...త్వరలో జరగనున్న రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీల తరఫున అభ్యర్థిని నిలిపి, సత్తా చాటాలని చర్చించినట్లు తెలుస్తోంది. ఇతర పార్టీల సీఎంలు పాలించే రాష్ట్రాలను కేంద్రం పరిగణలోకి తీసుకోవటం లేదనే అభిప్రాయం ఈ సమావేశంలో వ్యక్తం అయింది.

ప్రధాని మోదీ తీరుపైన అసహనం
గవర్నర్ల ద్వారా పెత్తనం చెలాయించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని అభిప్రాయం సైతం వ్యక్తం అయినట్లుగా తెలుస్తోంది. ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలకు వెళ్లి తమ పార్టీ గెలుపు కోసం వేల కోట్లతో పనులు చేపడుతున్నారంటూ కేసీఆర్ పేర్కొనట్లుగా సమాచారం. పెట్రోలు, డీజిల్ ధరల పెంపుదలకు కేంద్ర ప్రభుత్వానిదే పూర్తి బాధ్యతని ఇద్దరు సీఎంలు స్పష్టమైన అభిప్రాయం వ్యక్తం చేసారు. సెస్‌ల రూపంలో ప్రజలపై పెనుభారం వేశారని... నిజాన్ని అంగీకరించకుండా రాష్ట్రాలు పన్నులు తగ్గించాలని చెప్పడం సిగ్గుచేటు అంటూ కేసీఆర్ చెప్పుకొచ్చినట్లుగా తెలుస్తోంది.

రాష్ట్రపతి ఎన్నికల్లో అభ్యర్ధిని నిలబెట్టాలని
ప్లీనరీ వేదికగా నూ సీఎం కేసీఆర్ ఇదే విషయాన్ని స్పష్టం చేసారు. యూపీ, సహా అయిదు రాష్ట్రాల ఎన్నికల సమయంలో ఇంధన ధరలు పెరగకపోవడానికి నిజమైన కారణాలను ప్రధాని మోదీ చెప్పాల్సిన అవసరం ఉందని సీఎం కేసీఆర్ అభిప్రాయపడుతున్నారు. ఎన్డీయేకు సంపూర్ణ మెజారిటీ లేదు. విపక్షాల బలమే ఎక్కువగా ఉందని, తామందరం రాష్ట్రపతి ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిని నిలబెడితే భాజపా కంగుతింటుందని అభిప్రాయపడినట్లు తెలుస్తోంది.

ఎన్టీఏకు మెజార్టీ లేదు..ఉమ్మడి అభ్యర్ధిని బరిలో
కాంగ్రెస్ అనుకున్న రీతిలో జాతీయ పరిస్థితుల పైన స్పందించటం లేదని కేసీఆర్ అభిప్రాయపడినట్లుగా సమాచారం. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏకు పూర్తి మెజార్టీ లేదని.. విపక్షాల బలమే ఎక్కువగా ఉన్న ఈ సమయంలోనే ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్దిని బరిలో నిలబెట్టాలనే అభిప్రాయం వ్యక్తం అయింది. దీని పైన ఇతర పార్టీలతోనూ చర్చలు చేయాలని నిర్ణయించారు. త్వరలోనే బీజేపీయేతర సీఎంల సమావేశం ఏర్పాటు చేయాలని ..దీని పైన ముఖ్యమంత్రులతో మాట్లాడాలని నిర్ణయించారు.












Click it and Unblock the Notifications