హైదరాబాద్ ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఇక జాయింట్ పాస్
హైదరాబాద్ నగర ప్రయాణికులకు జాయింట్ పాస్ త్వరలో అందుబాటులోకి రానుంది. హైదరాబాద్ మెట్రో రైల్, టీజీఎస్ఆర్టీసీ సిటీ బస్సుల్లో ప్రయాణించేలా ఈ పాస్ కు తుదిరూపాన్ని ఇస్తోన్నారు అధికారులు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో దీన్ని వెంటనే ప్రవేశపెట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశించారు. ప్రయాణికుల రద్దీ, అవసరాల దృష్టిలో పెట్టుకుని డైలీ, మంత్లీ జాయింట్ పాస్‌లు అందజేసేలా తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు.
బేగంపేట మెట్రో రైల్ భవన్‌లో వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతో సంజయ్ జాజు సమన్వయ సమావేశం నిర్వహించారు. మెట్రో రైల్, టీజీఎస్ఆర్టీసీ, విద్యుత్, వాటర్ బోర్డ్ అధికారులతో కలిసి నగర రవాణా, ఇతర వసతులపై సమీక్షించారు. మెట్రో రైల్, ఆర్టీసీ బస్సు ప్రయాణాలకు ఒకే టికెటింగ్/పాస్ విధానాన్ని తీసుకురావడం వల్ల ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉంటుందని, సమయం ఆదా అవుతుందని పేర్కొన్నారు.

దీనిపై అధికారులు మాట్లాడారు. జాయింట్ పాస్ కు సంబంధించిన ఏర్పాట్లన్నీ ఇప్పటికే పూర్తయ్యాయని, త్వరలోనే ఛార్జీలను ఖరారు చేస్తామని అన్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ పాతబస్తీలో మెట్రో కారిడార్ విస్తరణ పనుల పురోగతిపై సీఎస్ సంజయ్ జాజు అధికారులకు దిశా నిర్దేశం చేశారు. దాదాపు 7.5 కిలోమీటర్ల మేర సాగే ఈ కారిడార్ నిర్మాణానికి సంబంధించిన రోడ్డు విస్తరణ పనులను ఎట్టి పరిస్థితుల్లో నెమ్మదించకూడదని, వీటిని మరింత వేగవంతం చేయాలని చెప్పారు.
బ్లూప్రింట్, పర్యవేక్షణ కోసం జనరల్ కన్సల్టెంట్‌ను నియమించే టెండర్ ప్రక్రియ వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఎక్కడా పనులకు ఆటంకం కలగకుండా భూసేకరణ ప్రక్రియను పూర్తి చేసి పనులను వెంటనే పట్టాలెక్కించాలని సూచించారు. నగరంలో భవిష్యత్తు ప్రజా రవాణా వ్యవస్థల అవసరాలకు అనుగుణంగా నిర్మించతలపెట్టిన ఎలివేటెడ్ కారిడార్ల రూపకల్పనపై కూడా ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు సంజయ్ జాజు. వాహనాల రద్దీని తట్టుకునేలా నూతన కారిడార్లను ప్లాన్ చేయాలని అన్నారు.
Chief Secretary Shri @sjaju1, IAS travelled by Hyderabad Metro Rail from Begumpet to Paradise today, accompanied by Hyderabad Metro Rail MD Shri Sarfaraz Ahmed and Additional MD Shri Ajith Reddy. pic.twitter.com/Ks8Y9kkoSS
— Office of Chief Secretary, Telangana Govt. (@TelanganaCS) September 6, 2026
అలాగే నేషనల్ హైవే 44 పై హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ నిర్మిస్తోన్న ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణ పనులను సంజయ్ జాజు స్వయంగా పరిశీలించారు. సమీక్ష అనంతరం ఆయన మెట్రో రైలులో ప్రయాణించారు. హైదరాబాద్ మెట్రో రైల్ మేనేజింగ్ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, అడిషనల్ ఎండీ బీ అజిత్ రెడ్డి తో కలిసి బేగంపేట మెట్రో స్టేషన్ నుంచి ప్యారడైజ్ జంక్షన్ వరకు సాధారణ ప్రయాణికుడిలా ట్రావెల్ చేశారు.
ప్రయాణికులతో మాట్లాడారు. వారి నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. మార్గమధ్యంలో వివిధ మెట్రో స్టేషన్లలో వాణిజ్య సముదాయాలు, వాహనాల పార్కింగ్ వసతులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. వాటిని మరింత అభివృద్ధి చేయడానికి అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని మెట్రో అధికారులను ఆదేశించారు.












Click it and Unblock the Notifications
