విషాదం: అడ్డుగా ఉన్నాడని, 3ఏళ్ల బాలుడి హత్య(ఫోటో)
హైదరాబాద్: తనని నమ్మి సహజీవనం చేసేందుకు వచ్చిన మహిళ కుమారుడిని ఓ వ్యక్తి అతి కిరాతకంగా చంపేశాడు. మూడేళ్ల పసివాడు తమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించి, అల్లరి చేస్తున్నాడన్న నెపంతో ఈ అఘాయిత్యానికి ఒడి గట్టాడు.
వివరాలిలా ఉన్నాయి. జేఎన్‌టీయూను ఆనుకుని ఉన్న గుడిసెల్లో శనివారం ఈ విషాద సంఘటన చోటు చేసుకుంది. గుంటూరు జిల్లా పెనుమాకకు చెందిన చింతయ్య, రాణి భార్యభర్తలు. వారికి ఇద్దరు మగ పిల్లలు, ఒక ఆడపిల్ల ఉన్నారు.

రాణి భర్తను వదిలేసిన తన ముగ్గురు పిల్లలను తీసుకుని 20 రోజుల క్రితం విజయవాడ రాణిగారితోటకు చెందిన మోహన్‌తో కలిసి నగరానికి వచ్చింది. జేఎన్‌టీయూ పక్కనే ఉన్న గుడిసెల్లో వారిద్దరూ సహజీవనం సాగిస్తున్నారు.
ముగ్గురు పిల్లలు వారితోనే ఉంటున్నారు. రాణి అక్కడున్న వారి ఇళ్లలో పనిమనిషిగా చేరింది. మోహన్ గతంలో క్యాటరింగ్ పని చేసి, ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నాడు. రాణి చిన్న కుమారుడు చైతన్య (3) అల్లరి చేస్తుండటంతో మోహన్ ఇబ్బందిగా భావించేవాడు.

శుక్రవారం మోహన్, రాణిల మధ్య గొడవ జరిగింది. దీనికి తోడు చైతన్య అల్లరి మరింత కోపం తెప్పించడంతో, పిల్లాడిని మోహన్ కర్రతో బాదాడు. శనివారం కూడా బాలుడిని మరోసారి కొట్టి, ఊపిరాడకుండా నోటిని అదమడంతో, బాలుడు ప్రాణాలు విడిచాడు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని, కేసు నమోదు చేశారు.












Click it and Unblock the Notifications