మరో వివాదంలో కరాటే కళ్యాణి - ఇంట్లో సోదాలు: ఫిర్యాదు - వెంటనే రంగంలోకి..!!
సినీ నటి కరాటే కల్యాణి మరో వివాదంలో చిక్కుకున్నారు. ఇటీవలే యూట్యూబర్ శ్రీకాంత్‌రెడ్డితో కరాటే కళ్యాణి మధ్య వివాదం హాట్ టాపిక్‌గా మారింది. ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. దీని పై ఎస్సార్‌నగర్ పోలీస్ స్టేషన్లో ఇద్దరు ఫిర్యాదు చేసుకున్నారు. ఇక, ఇప్పుడు కరాటే కల్యాణి ఇంట్లో చైల్డ్ లేబర్ అధికారులు సోదాలు నిర్వహించారు. కరాటే కల్యాణి అక్రమంగా చిన్నారిని కొనుగోలు చేసినట్లు వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో సోదాలు చేపట్టినట్లు అధికారులు పేర్కొన్నారు.

అక్రమంగా చిన్నారులను
కరాటే కల్యాణి అక్రమంగా చిన్నారులను దత్తత తీసుకోవడం, కిడ్నాప్, కొనుగోలు చేయడం వంటి నేరాలకు పాల్పడుతున్నారంటూ చైల్డ్ లైన్ టోల్‌ఫ్రీ నం.1098కు ఆదివారం ఓ వ్యక్తి ఫోన్ చేసి ఫిర్యాదు చేశాడు. కల్యాణి ఇంటికి చేరుకున్న చైల్డ్ లైన్ అధికారులు మహేశ్, సంతోష్ విచారణ చేపట్టారు. అయితే, ఆ సమయంలో కరాటే కల్యాణి ఇంట్లో లేరు. కరాటే కల్యాణి తల్లి విజయలక్ష్మిని అధికారులు విచారించారు. కరాటే కళ్యాణి పలువురు చిన్నారులను కిడ్నాప్ చేయడంతో పాటు 2నెలల పిల్లలను కొనుగోలు చేసినట్లుగా ఫిర్యాదులు వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు.

కళ్యాణీ నివాసంలో సోదాలు
నెలల వయస్సున్న పిల్లలను అడ్డుపెట్టుకుని డబ్బు వసూళ్లకు పాల్పడుతున్నారనే ఫిర్యాదులు రావడంతో విచారణ కోసం ఆమె నివాసానికి వచ్చినట్లు చైల్డ్ లేబర్ అధికారులు తెలిపారు. కల్యాణి ఇంట్లో అధికారులు ఒక చిన్నారిని గుర్తించారు. ఆ చిన్నారి ఎవరు, ఎక్కడి నుంచి వచ్చింది వంటి తదితర వివరాలపై అధికారులు ఆరా తీసారు. ఓ దంపతులకు పుట్టిన మూడో ఆడబిడ్డను కల్యాణి పెంచుకుంటోందని ఆమె తల్లి విజయలక్ష్మి అధికారులకు వివరించారు. తెలిసిన వ్యక్తుల ద్వారా పాపను తెచ్చుకున్నామని తెలిపింది. పాపను న్యాయబద్ధంగానే దత్తత తీసుకుందని విజయలక్ష్మి స్పష్టం చేశారు.

నేడు మరోసారి సోదాలు నిర్వహించే ఛాన్స్
కరాటే కల్యాణి తల్లి విజయలక్ష్మి అందజేసిన వివరాల మేరకు చట్టబద్ధత లేకుండా చిన్నారులను తెచ్చి, పెంచుకుంటున్నట్లు తాము అనుమానిస్తున్నామని చైల్డ్ లైన్‌అధికారులు తెలిపారు. పలువురు చిన్నారులను కిడ్నాప్ చేయడంతో పాటు 2 నెలల వయసున్న పిల్లలను కొనుగోలు చేసినట్టు, పిల్లలను అడ్డుపెట్టుకుని డబ్బులు వసూలు చేస్తున్నట్టు ఫిర్యాదులు అందినట్లు అధికారులు తెలిపారు. దీంతో.. ఈ రోజు మరోసారి అధికారులు వచ్చి కళ్యాణిని విచారించే అవకాశం ఉందని తెలుస్తోంది.