ఉదయనిధి స్టాలిన్ కామెంట్లపై చిలుకూరి బాలాజీ అర్చకులు రంగరాజన్ ఆగ్రహం
హైదరాబాద్: తమిలనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్.. సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలను సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుని విచారించాలని చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకులు రంగరాజన్ కోరారు. చిలుకూరు బాలాజీ ఆలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సనాతన ధర్మాన్ని ఉద్దేశిస్తూ ఉదయనిధి స్టాలిన్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడారని మండిపడ్డారు.
ఇది శ్రీరాముడు, శ్రీకృష్ణుడిని కించపర్చడమే అవుతుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూ.. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అవివేకమని అన్నారు. సనాతన ధర్మానికి వేల కోట్ల చరిత్ర ఉందని తెలిపారు. వేదాలే దీనికి ఆధారమని చెప్పారు.

ఉదయనిధిపై కఠిన చర్యలు తీసుకుంటేనే.. ఇలాంటి కామెంట్లు వేరేవాళ్లు చేయరని రంగరాజన్ అన్నారు. సనాతన ధర్మాన్ని కించపర్చడం అంటే.. దేవుళ్లను, వేదాలను అవమానించడమేనని ఉదయనిధి స్ఠాలిన్‌పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరోవైపు, బీజేపీ నేతలు కూడా ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని, ఓటు బ్యాంక్ పాలిటిక్స్‌లో భాగంగానే ఉదయనిధి స్టాలిన్ ఈ వ్యాఖ్యలు చేశారన్నారు బీజేపీ తమిళనాడు కో-ఇంఛార్జ్ పొంగులేటి సుధాకర్ రెడ్డి.
కావాలనే మతాల మధ్య చిచ్చుపెడుతున్నారని మండిపడ్డారు. ఉదయనిధి కామెంట్లపై ఇండియా కూటమిలోని డీఎంకే, కాంగ్రెస్ సహా ఇతర పార్టీలు ఖండించకపోవడంతో విచారకరమని అన్నారు. రోజు రోజుకు బీజేపీకి పెరుగుతున్న ఆదరణ, కేంద్రప్రభుత్వ పనితీరును కొందరు ఓర్వలేకపోతున్నారని పొంగులేటి సుధాకర్ అన్నారు.
అసలు ఉదయనిధి స్టాలిన్ ఏమన్నారంటే : తమిళనాడు ప్రొగ్రెసివ్ రైటర్స్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ శనివారం 'సనాతన నిర్మూలన' పేరుతో నిర్వహించిన సమావేశంలో ఉదయనిధి పాల్గొని ప్రసంగించారు. సనాతన ధర్మం అనేది సామాజిక న్యాయానికి వ్యతిరేకమని, దీనిని కేవలం వ్యతిరేకించడమే కాకుండా.. కరోనా, డెంగ్యూలాంటి వ్యాధుల్లా పూర్తిగా నిర్మూలించాలని అన్నారు.












Click it and Unblock the Notifications