
చిన్నజీయర్ వ్యాఖ్యలపై ముదురుతున్న రగడ; చెప్పుల దండలు, దిష్టిబొమ్మల దహనాలతో వార్నింగ్
గిరిజనుల ఆరాధ్య దైవాలైన సమ్మక్క, సారలమ్మలపై త్రిదండి చిన్న జీయర్ స్వామి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చిలికిచిలికి గాలివానగా మారుతున్నాయి. సమ్మక్క, సారలమ్మ జాతరను కించపరిచేవిధంగా చిన్న జీయర్ స్వామి చేసిన వ్యాఖ్యలపై మండిపడుతున్న ఆదివాసీ గిరిజన సంఘాలు ఇప్పటికే చిన్న జీయర్ స్వామి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశాయి. ఆసియా ఖండంలోనే అతిపెద్ద మహాజాతర ఐన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చిన్న జీయర్ స్వామిపై చర్యలు తీసుకోవాలని ఆదివాసీ గిరిజన సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

మేడారంలో చిన్నజీయర్ స్వామి దిష్టిబొమ్మ దహనం
సమ్మక్క సారలమ్మ జాతరను కించపరుస్తూ చిన్నజీయర్ స్వామి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా మేడారంలో చిన్న జీయర్ స్వామి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. చిన్న జీయర్ స్వామి చిత్రపటానికి చెప్పుల దండలు వేసి ఆదివాసీ గిరిజనులు తమ నిరసనను తెలియజేశారు. అగ్రకులాల అహంకారాన్ని ప్రదర్శిస్తూ చిన్న జీయర్ స్వామి వ్యాఖ్యలు చేశారని మండిపడుతున్నారు. తక్షణం చిన్నజీయర్ స్వామి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఖబడ్దార్ చిన్నజీయర్ స్వామి .. అంటూ హెచ్చరికలు
దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల ప్రజలు, కోట్లాదిమంది మేడారం సమ్మక్క సారలమ్మలను మహిమాన్విత దేవతలుగా నమ్మి పూజిస్తూ ఉంటే, చిన్న జీయర్ స్వామి సమ్మక్క సారలమ్మ ఎవరు? గ్రామ దేవతలు అంటూ, చదువుకున్న మేధావులు కూడా వారి కోసం వెళుతూ అజ్ఞానంలో బ్రతుకుతున్నారు అంటూ విమర్శలు చేయడం దారుణమని వారు అంటున్నారు. కోట్లాది ప్రజల కొంగుబంగారమై నిలిచే గిరిజనుల ఆరాధ్య దేవతలైన, సమ్మక్క సారలమ్మ ల పైన చిన్న జీయర్ స్వామి చేస్తున్న వ్యాఖ్యలు క్షమించరానివని వారంటున్నారు. చిన్న జీయర్ స్వామి ఖబడ్దార్ అంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఆయన వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.

అర్ధంకాని భాషలో మంత్రాలు చదువుతూ నిలువు దోపిడీ చేస్తున్నారని ఆదివాసీలు ఫైర్
ఒక చిన్న జీయర్ స్వామి వ్యాఖ్యలు పై మండిపడిన ఆదివాసి నాయకపోడు జిల్లా అధ్యక్షుడు కొత్త సురేందర్ భారతదేశంలో 18 శక్తి పీఠాలు గోండు రాజులు పరిపాలిస్తే, వాటిని ఆక్రమించుకుని వ్యాపార కేంద్రాలుగా మార్చుకుని, చెమట చిందించకుండా అర్థం కాని భాషలో మంత్రాలు చదువుతూ నిలువు దోపిడీ చేస్తున్నారంటూ స్వామీజీల పై మండిపడ్డారు. అలాంటి చిన్న జీయర్ స్వామికి మా ప్రకృతి దేవతలను విమర్శించే నైతిక హక్కు లేదని కొత్త సురేందర్ పేర్కొన్నారు.
Recommended Video

ఆయన క్షమాపణ చెప్పకుంటే రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు
చిన్న జీయర్ స్వామి క్షమాపణ చెప్పకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరిస్తున్నారు. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర విశిష్టతను, ఆదివాసీల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా చిన్న జీయర్ స్వామి చేసిన వ్యాఖ్యలను తక్షణం వెనక్కి తీసుకోవాలని, లేదంటే తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని వార్నింగ్ ఇస్తున్నారు. ఇప్పటికే మేడారం సమ్మక్క సారలమ్మలను కించపరుస్తూ చిన్నజీయర్ స్వామి చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్యే సీతక్క తీవ్రంగా ఖండించారు. బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.