వైద్య శిఖరానికి జోహార్లు.!కాకర్ల మృతికి సంతాపం తెలియజేసిన చిరంజీవి, బాలకృష్ణ.!
హైదరాబాద్ : నిమ్స్ మాజీ డైరక్టర్, ప్రముఖ వైద్యుడు పద్మశ్రీ డాక్టర్ కాకర్ల సుబ్బారావు మరణం పట్ల మెగాస్టార్ చిరంజీవి సంతాపం వ్యక్తం చేశారు. కాకర్ల సుబ్బారావు మరణించినందుకు విచారం వ్యక్తం చేస్తున్నట్టు తెలియజేసారు. ఆయన రేడియాలజిస్టే కాదు, దూరదృష్టి గల వ్యక్తి. నిమ్స్‌ను దేశంలో ప్రీమియర్ వైద్య సంస్థగా మార్చారు.
ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తున్నాను. కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అని చిరంజీవి తన ట్వీట్‌లో పేర్కొన్నారు. కాకర్ల సుబ్బారావు 1925లో కృష్ణా జిల్లా పెదముత్తేవి గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో జన్మించారు.

పాఠశాల విద్యాభ్యాసం చల్లపల్లిలో, కళాశాల విద్యాభ్యాసం మచిలీపట్నం హిందూ కళాశాలలో సాగింది. విశాఖ ఆంధ్ర వైద్య కళాశాల నుంచి డాక్టర్ పట్టా పొందారు. 1951లో హౌస్ సర్జన్ చేసిన తర్వాత వైద్యంలో ఉన్నత విద్య కోసం ప్రత్యేక పారితోషికంతో అమెరికా వెళ్లారు. అమెరికా రేడియాలజీ బోర్డు పరీక్షల్లో 1955లో ఉత్తీర్ణులయ్యారు.
ఇదిలా ఉండగా 1956లో స్వదేశానికి తిరిగి వచ్చి హైదరాబాద్‌లోని ఉస్మానియా వైద్య కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేరారు సుబ్బారావు. ఆ తర్వాత ఉస్మానియా కళాశాలలోనే ప్రధాన రేడియాలజిస్టుగా పదోన్నతి పొందారు. హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రి డైరెక్టర్‌గా సేవలందించారు.
కార్పొరేట్ ఆస్పత్రులకు ధీటుగా నిమ్స్‌ను తీర్చిదిద్దారు కాకర్ల. 2000 సంవత్సరంలో ఆయన పద్మ శ్రీ అవార్డు అందుకున్నారు. అంతే కాకుండా ప్రముఖ వైద్య దిగ్గజం కాకర్ల సుబ్బారావును తెలుగునేల కోల్పోయిందని టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆవేదన వ్యక్తం చేసారు. కాకర్ల సుబ్బారావు మృతి వైద్య వృత్తికి తీరని లోటు.
ఎంతో మంది వైద్యులను తీర్చిదిద్ది తెలుగు నేలకు అందించిన మహానుభావులు సుబ్బారావు. లక్షలాది మందికి వైద్యం అందించి ప్రాణదాతగా పేరు పొందారు. నిమ్స్ లో అంతర్జాతీయ స్థాయిలో వైద్య సేవలు అందించేందుకు కృషి చేశారు. వైద్యసేవలో తెలుగుజాతికి గుర్తింపును తెచ్చారు. తెలుగు ప్రజలకు ఆయన చేసిన సేవల చిరస్మరనీయం. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నానని బాలకృష్ణ తెలిపారు.












Click it and Unblock the Notifications