నాంపల్లి సిబిఐ కోర్టుకు హాజరైన సినీ నటుడు ప్రభు దేవా
హైదరాబాద్: ప్రముఖ సినీ నటుడు ప్రభు దేవా సోమవారం హైదరాబాదులోని నాంపల్లిలో గల సిబిఐ కోర్టుకు హాజరయ్యారు. ఆయన ఉదయం పదిన్నర గంటలకు కోర్టుకు వచ్చారు. తెలంగాణలోని మెదక్ జిల్లాలో ఓ భూమి కొనుగోలుకు చెందిన వ్యవహారంలో ఆయన కోర్టుకు హాజరయ్యారు.
ఆయన సాక్షిగానే కోర్టుకు హాజరైనట్లు తెలుస్తోంది. అక్రమాస్తుల కేసులో హరిప్రసాద్ అనే ఆదాయం పన్ను శాఖ అధికారిని సిబిఐ అధికారులు అరెస్టు చేసి, విచారించారు. హరిప్రసాద్ అక్రమాస్తుల కేసు విచారణ నాంపల్లి సిబిఐ కోర్టులో నడుస్తోంది. హరిప్రసాద్ నుంచి ప్రభు దేవా మెదక్ జిల్లాలో భూమి కొనుగోలు చేసినట్లు సిబిఐ విచారణలో తేలింది.

దాంతో హరిప్రసాద్ అక్రమాస్తుల కేసులో ప్రభు దేవా సాక్షిగా హాజరు కావాల్సి వచ్చింది. తాను తన మేనేజర్ ద్వారా భూమి కొనుగోలు చేశానని, మిగతా విషయాలేవీ తనకు తెలియదని ప్రభు దేవా కోర్టుకు చెప్పారు. ఉదయం పదిన్నర గంటలకు కోర్టుకు వచ్చిన ప్రభు దేవా లిఫ్ట్‌లో కోర్టు హాల్‌కు వెళ్లారు.
కోర్టులో సాక్ష్యం చెప్పిన తర్వాత అదే లిఫ్ట్‌లో ఆయన దిగి వచ్చి వచ్చిన కారులోనే వెళ్లిపోయారు. వెళ్లిపోయే సమయంలో ఆయన ఎవరితోనూ మాట్లాడలేదు. మీడియాతో మాట్లాడడానికి కూడా ఆయన ఇష్టపడలేదు. ఆయన 20 నిమిషాల పాటు కోర్టులో ఉన్నారు.












Click it and Unblock the Notifications