కెటిఆర్‌కు సరైన సమయంలో ప్రజలు బుద్దిచెబుతారు: జానారెడ్డి
హైదరాబాద్: తనపై తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కెటిఆర్ చేసిన విమర్శలను సిఎల్పీ నేత జానారెడ్డి గురువారం నాడు తీవ్రంగా ఖండించారు. అహంకారం, అధికార దర్పంతో కెటిఆర్ మాట్లాడుతున్నారని జానారెడ్డి వ్యాఖ్యానించారు. కెటిఆర్‌కు సరైన సమయంలో సరైన రీతిలో బుద్దిచెప్పేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారని జానారెడ్డి చెప్పారు.
హైద్రాబాద్‌లోని సిఎల్పీ కార్యాలయంలో గురువారం నాడు జానారెడ్డి మీడియాతో మాట్లాడారు. టిఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్న తీరును ప్రజాస్వామ్య వాదులంతా ఖండిస్తున్నారని జానారెడ్డి గుర్తు చేశారు.మూడున్నర ఏళ్ళలో కెసిఆర్ ఎన్నికల్లో ఇచ్చిన హమీలను నెరవేర్చలేదని జానారెడ్డి అభిప్రాయపడ్డారు.

అసెంబ్లీనూ మాట్లాడకుండా, బయట మాట్లాడకుండా ఉండాలని టిఆర్ఎస్ వ్యవహరిస్తోందని జానారెడ్డి మండిపడ్డారు. తనపై మంత్రి కెటిఆర్ చేసిన విమర్శలు సంస్కారవంతుడు మాట్లాడినట్టుగా లేవన్నారు. సంస్కారహీనంగా కెటిఆర్ విమర్శలు చేశారని జానారెడ్డి చెప్పారు.
కెటిఆర్ తో పాటు టిఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలకు సమాధానమిచ్చి తన స్థాయిని తగ్గించుకోదల్చుకోలేదన్నారు. కానీ, మౌనంగా ఉంటే తప్పుడు సంకేతాలు వెళ్తాయని తనకు ఫోన్లు వస్తున్న నేపథ్యంలోనే స్పందించాల్సి వస్తోందని జానారెడ్డి చెప్పుకొచ్చారు.
అహంకారంతో మంత్రి కెటిఆర్ చేసిన విమర్శలపై ప్రజలు తగిన సమయంలో బుద్ది చెప్పేందుకు సిద్దంగా ఉన్నారని ఆయన చెప్పారు.టిఆర్ఎస్ నేతలు ఇప్పటికైనా తమ పద్దతిని మార్చుకోవాలని జానారెడ్డి సూచించారు.












Click it and Unblock the Notifications