డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన సీఎం చంద్రబాబు..!!
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ గత ఐదు రోజులుగా వైరల్ జ్వరంతో బాధపడుతున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ఆయన కార్యాలయం ప్రకటించగా.. వైద్యుల సూచన మేరకు పవన్ ప్రస్తుతం పూర్తి విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు (సెప్టెంబర్ 28, 2025) హైదరాబాద్‌లోని పవన్ నివాసానికి వెళ్లి ఆయనను స్వయంగా పరామర్శించారు.
ఈ మేరకు పవన్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న చంద్రబాబు.. ఆయన త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షించారు. పవన్‌కు అవసరమైన చికిత్స కొనసాగుతోందని సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న జనసేన అధినేత ఆరోగ్యం బాగోలేని తరుణంలో.. ముఖ్యమంత్రి స్వయంగా ఇంటికి వెళ్లి పరామర్శించడం వారిద్దరి మధ్య ఉన్న వ్యక్తిగత ఆత్మీయతను, పొత్తు ధర్మాన్ని ప్రతిబింబిస్తోందని సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.

ఇక ఇటీవల ఏపీ అసెంబ్లీలో మెగాస్టార్ చిరంజీవిపై హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారం రేపుతోన్న విషయం తెలిసిందే. అలాగే సభా సమావేశాల్లో బొండా ఉమ చేసిన కామెంట్లు కూడా రాజకీయంగా చర్చనీయాంశం అయ్యాయి. అయితే ఈ అంశాలపై పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు స్పందించలేదు. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు-పవన్ భేటీ రాజకీయ వర్గాల్లో ఉత్కంఠను రేకెత్తిస్తోంది.
కామినేని Vs బాలయ్య..
లా అండ్ ఆర్డర్ అంశంపై మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ.. చిరంజీవి చాలా గట్టిగా అడిగిన తరువాత జగన్ అపాయింట్‌మెంట్ ఇచ్చారని చెప్పారు. ఈ వ్యాఖ్యలను బాలకృష్ణ ఖండించారు. చిరంజీవి గట్టిగా మాట్లాడటం వల్లే జగన్ అపాయింట్‌మెంట్ ఇచ్చారన్నది పచ్చి అబద్ధమన్నారు. "సైకోని ఇండస్ట్రీ నుంచి కొందరు కలవడానికి వెళ్లినప్పుడు చిరంజీవి గట్టిగా అడిగితేనే జగన్ వచ్చారు అనడం అబద్ధం.. అలా ఎవ్వరూ అడగలేదు అని బాలకృష్ణ స్పష్టం చేశారు.
గత కొద్ది రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్న ఉప ముఖ్యమంత్రి @PawanKalyan ను ఆయన నివాసంలో పరామర్శించి, ఆయన త్వరగా కోలుకోవాలని, ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలని తెలియజేసిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారు. pic.twitter.com/SrzvL2QXk0
— Deputy CMO, Andhra Pradesh (@APDeputyCMO) September 28, 2025
ఈ వ్యాఖ్యలపై పెద్ద దుమారం రేగుతోంది. దీనిపై ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి సైతం స్పందించి ప్రెస్ నోట్ సైతం రిలీజ్ చేశారు. వైసీపీ నేతలు, చిరంజీవి అభిమాన సంఘాలు సైతం తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.












Click it and Unblock the Notifications