దీక్షకు బయల్దేరిన రేవంత్: మల్లన్నసాగర్ నిర్వాసితులపై దిగొచ్చిన కేసీఆర్
హైదరాబాద్: మల్లన్నసాగర్ భూ నిర్వాసితులకు విపక్షాలు మద్దతు తెలపడంతో టీఆర్ఎస్ ప్రభుత్వం దిగొచ్చింది. మల్లన్న సాగర్ భూ నిర్వాసితులపై సీఎం కేసీఆర్ శనివారం స్పందించారు. రైతుల ప్రయోజనాలు, అభిప్రాయాలకు అనుగుణంగా మల్లన్నసాగర్ భూనిర్వాసితులకు ప్రభుత్వం పరిహారం అందిస్తుందని ఆయన స్ఫష్టం చేశారు.
శనివారం మల్లన్నసాగర్ భూ నిర్వాసితులపై ఆయన సమీక్ష నిర్వహించారు. రైతులకు నష్టపరిహారం చెల్లించడానికి రెండు విధాలున్నాయని అన్నారు. ఈ రెండు విధానాల్లోనే రైతులకు పరిహారం అందిస్తామని తెలిపారు. 2013 భూసేకరణ చట్టం లేదా జీవో 123 కింద ఎలా కోరితే అలా పరిహారం చెల్లిస్తామని సీఎం పేర్కొన్నారు.

మల్లన్న సాగర్ భూ నిర్వహితుల విషయంలో కేసీఆర్ ప్రభుత్వంపై పెద్దఎత్తున విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్వాసితులకు మద్దతుగా మెదక్‌జిల్లా ఏటిగడ్డ కిష్టాపూర్‌లో రెండు రోజులపాటు రేవంత్‌రెడ్డి నిరాహార దీక్ష చేయనున్నారు. ఈ దీక్షకు బయల్దేరే ముందు శనివారం జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ మల్లన్నసాగర్ భూ నిర్వాసితులు వంద రోజులుగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదన్నారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు వల్ల ముంపునకు గురవుతున్న ఇరవైవేల ఎకరాలకు నష్ట పరిహారం చెల్లించడంలో ప్రభుత్వం విఫలమైందని దుయ్యబట్టారు.
జీవో నెం.123తో పేదల భూముల్ని తీసుకునేందుకు ప్రభుత్వం యత్నిస్తోందని, 2013 భూ సేకరణ చట్టాన్ని అమలు చేయాలని రేవంత్ డిమాండ్ చేశారు. అక్కడ 14 గ్రామాలు ఉన్నాయని, భూములు కోల్పోయిన వారికి డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు ఇస్తామని ప్రభుత్వం చెప్పిందన్నారు.
ఎకరాకు రూ. 5.80లక్షలు అందిస్తామని ప్రభుత్వం జీవో కూడా తెచ్చిందని అన్నారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు వల్ల ముంపునకు గురైన వేలాది రైతులకు న్యాయం జరగటానికే దీక్ష చేపడుతున్నట్లు రేవంత్‌రెడ్డి చెప్పారు. దీనిపై రాజకీయం చేసేందుకు రంగంలోకి దిగిన విపక్షాలకు కేసీఆర్ తాజా నిర్ణయం షాకిచ్చింది.












Click it and Unblock the Notifications