డీఎస్‌కు ఛాన్స్: కవిత సిఫారసు పనిచేసింది, టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్దులు వీరే
హైదరాబాద్: త్వరలో రాజ్యసభకు జరగనున్న ఎన్నికలకు టీఆర్ఎస్ తన అభ్యర్ధులను ప్రకటించింది. టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్ధులను ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం ప్రకటించారు. రెండు రోజులుగా పార్టీ సీనియర్లు, మంత్రులతో సంప్రదింపులు జరిపిన అనంతరం పీసీసీ మాజీ అధ్యక్షుడు కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్‌లోకి చేరిన డి. శ్రీనివాస్, కెప్టెన్ లక్ష్మీకాంతరావులను టీఆర్ఎస్ తరఫున రాజ్యసభకు పంపాలని నిర్ణయించారు.
డీఎస్, కెప్టెన్ లక్ష్మీకాంతరావులను రాజ్యసభ అభ్యర్ధులుగా ఖరారు చేసినట్టు టీఆర్ఎస్ ఒక ప్రకటనలో తెలిపింది. రాజ్యసభ రేసులో మొదటి నుంచి కెప్టెన్ లక్ష్మీకాంతరావు పేరు వినిపిస్తూనే ఉండగా, రెండో స్థానం కోసం పలువురు నేతలు తమ వంతు ప్రయత్నాలు చేసినా చివరకు ఆ సీటు డీఎస్‌కు దక్కింది.
మరోవైపు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎమ్మెల్సీ స్థానంలో మాజీ మంత్రి ఫరీదుద్దిన్‌కు అవకాశం కల్పించారు. మరోవైపు కేఎల్ రాజ్యం, కేకే తదితరులు స్వయంగా కేసీఆర్‌ను కలిసి తమకు చాన్స్ ఇవ్వాలని కోరినా ఆయన డీఎస్‌కే రాజ్యసభ సీటు ఇవ్వడం గమనార్హం. కాగా డీఎస్‌కు రాజ్యసభ సీటు కేటాయించడం వెనుక నిజమాబాద్ ఎంపీ, కేసీఆర్ కుమార్తె కవిత సిఫారసు పని చేసిందని అంటున్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో దేశ, రాష్ట్ర రాజకీయాలలో అనుభవం ఉన్న నాయకుడు రాజ్యసభలో టీఆర్‌ఎస్ తరపున ప్రాతినిధ్యం వహిస్తే బాగుంటుందని కేసీఆర్ కూతురు కవిత డీఎస్ పేరును ప్రతిపాదించగా.. దానికి కేసీఆర్ కూడా సానుకూలంగా స్పందించి డి.శ్రీనివాస్ పేరును ఖరారు చేసినట్టు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే కాంగ్రెస్ తరుపున వి. హనుమంతరావు రాజ్యసభకు నామినేషన్ వేయనున్నారు. పార్టీ అధినేత్రి సోనియా గాంధీని భేటీ అయిన వీహెచ్ రాజ్యసభకు పోటీపై చర్చించారు. కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం లేకపోయినా, హైదరాబాదులో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీసీఎల్పీ నేత కుందూరు జానారెడ్డిలతో భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా ఆయన వారి ముందు ఓ కొత్త ప్రతిపాదన పెట్టారు. గెలిచే బలం లేకున్నా మరోమారు తాను రాజ్యసభ బరిలోకి దిగుతానని చెప్పిన వీహెచ్ అవసరమైతే తాను స్వయంగా కేసీఆర్‌తో చర్చిస్తానని, తనకు పోటీలో నిలపాలని ఈ ఉదయం కాంగ్రెస్‌ను కోరారు.












Click it and Unblock the Notifications