కేసీఆర్‌కు మహిళలంటే గౌరవం లేదు, సీఎంకు గవర్నర్ అందుకే మంచిది కాదు: బండి సంజయ్
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహారశైలిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జరిగిన వేడుకల్లో ఎంపీ బండి సంజయ్ పాల్గొన్నారు. కర్మాన్ ఘాట్ వేదికగా జరిగిన ఈ వేడుకలో పాల్గొని జీహెచ్ఎంసీలో పనిచేస్తున్న మహిళా కార్మికులకు చీరలు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మహిళలందరికీ మహిళ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. 'మహిళలు ఎక్కడ గౌరవించబడతారో, పూజించబడతారో అక్కడ దేవతల సంచరిస్తారు. మహిళలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నా. కేసీఆర్ పాలనలో మహిళలకు రక్షణ లేదు. కేసీఆర్ మొదటి ప్రభుత్వంలో మహిళలకు మంత్రి పదవి ఇవ్వలేదు' అని అన్నారు.
అంతేగాక, 'ఇప్పుడు ఇద్దరు మహిళలకు మాత్రమే మంత్రులుగా ప్రాతినిధ్యం కల్పించారు. వాళ్లకు ఎలాంటి అధికారాలు లేవు. రాష్ట్ర ప్రథమ పౌరురాలు గవర్నర్‌ను అవమానించారు. గుండా అయిన రౌడీ అయిన వ్యక్తికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వకుండా అడ్డుకున్నందుకు గవర్నర్ మంచిది కాదంటున్నారు' అని కేసీఆర్ పై మండిపడ్డారు.

'సమ్మక్క సారలమ్మ జాతరకు గవర్నర్ వెళితే అధికారులు వెళ్లొద్దని సూచించారట సీఎం కేసీఆర్. రాష్ట్రంలో మహిళ గవర్నర్‌కు కూడా సీఎం కేసీఆర్ గౌరవం కల్పించలేకపోయారు. కేసీఆర్‌కు మహిళలంటే గౌరవం లేదు' అని బండి సంజయ్ విమర్శలు గుప్పించారు.
ఉన్నతస్థానంలో ఉన్నా గౌవరం దక్కడం లేదని గవర్నర్ తమిళిసై ఆవేదన
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహిళలకు ఇప్పటికీ సరైన గౌరవం దక్కడం లేదన్నారు. సోమవారం రాజ్భవన్లో నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకల్లో.. మహిళా సాధికారతను ఉద్దేశించి గవర్నర్ మాట్లాడారు. మహిళలకు ఇప్పటికీ సరైన గౌరవం దక్కలేదన్న గవర్నర్ తమిళిసై.. చివరికి అత్యున్నత పదవిలో ఉన్న వారు సైతం సరైన గౌరవం పొందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తననెవరూ భయపెట్టలేరని.. తాను దేనికి భయపడనని స్పష్టం చేశారు.
ఏ స్త్రీ తన స్వార్థం కోసం ఏదీ కోరుకోదని.. ప్రతిదీ తన కుటుంబం కోసమే కోరుకుంటుందని గవర్నర్ తెలిపారు. స్త్రీలందరూ ఆర్థిక స్వావలంబన కలిగి ఉండాలని గవర్నర్ తమిళిసై అన్నారు. భవిష్యత్తు కోసం పొదుపు పాటించాలని చెప్పారు. నిరాశ, నిస్పృహలో కూరుకుపోకుండా ప్రతి అడుగూ నూతనోత్సహంతో ముందుకు సాగాలని మహిళలకు గవర్నర్ తమిళిసై పిలుపునిచ్చారు. మహిళలకు పలు సూచనలు చేస్తూ.. ముఖ్యంగా ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలన్నారు.
Recommended Video
ఆనందాన్ని వదులుకోవద్దన్నారు. ఈ సందర్భంగా తమిళనాడు మహిళలకు, తెలంగాణ స్త్రీలకు తేడా ఏంటని.. ఇటీవల తనను ఓ ఇంటర్వ్యూలో అడిగారని తమిళిసై తెలిపారు. అందరూ ఒకేలా ఉంటారని సమాధానం చెప్పినట్లు తెలిపారు. తెలంగాణ సోదరిగా తాను ఇక్కడి మహిళల జీవన విధానాన్ని ఎంతగానో ఇష్టపడతానని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వెల్లడించారు.












Click it and Unblock the Notifications