ఆకాశమంత ఎత్తు ఎదిగాం - ఇది నా అదృష్టం: సీఎం కేసీఆర్
తెలంగాణ ఏ రంగంలో చూసినా దూసుకుపోతోందని..ఆకాశమంత ఎత్తు ఎదిగిందని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభోత్సవంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేసారు. తెలంగాణ పునర్నిర్మాణం అంటే కొందరు పిచ్చివారు కారుకూతలు కూశారన్నారు. ఇప్పుడు అన్ని రంగాల్లో అగ్రపథాన నిలుస్తూ పునర్నిర్మాణం అంటే ఏంటో అర్దమయ్యేలా చేసామని వివరించారు. తెలంగాణ పాలన కోసం ఆకాశమంత అద్భుతమైన సచివాలయం నిర్మించుకున్నామని..ఇందులో ప్రతీ ఒక్కరి భాగస్వామ్యం ఉందన్నారు.
తెలంగాణ పునర్నిర్మాణం : తెలంగాణ ఉద్యోగులకు ముఖ్యమంత్రి కేసీఆర్ సందేశం ఇచ్చారు. తెలంగాణ భావాన్ని, నిర్మాణాన్ని కాంక్షను జీర్ణించుకోలేని కొందరు చేసినా పట్టించుకోకుండా ఇవాళ పునర్నిర్మాణం చేసుకున్నామని చెప్పారు. ఏ రంగం చూసినా దూసుకుపోతున్నామని వివరించారు. తలసరి ఆదాయంలో ముందు వరుసలో ఉన్నామని చెప్పారు. మరుగుజ్జుల్లారా ఇప్పటికైనా కుళ్లును వదలండని సూచించారు.

సుదీర్ఘ పోరాటంతో తెలంగాణ సాధించుకున్నామని, సమైక్య పాలనలో తెలంగాణ నష్టపోయిందని వివరించారు. తెలంగాణ సాధించిన పురోగతికి నిదర్శనం సచివాలయమని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పుకొచ్చారు. అంబేద్కర్, గాంధీ మార్గంలోనే తెలంగాణ సాధించామని గుర్తు చేసారు. తెలంగాణ పల్లెలు కూడా అద్బుతంగా ఉన్నాయని పేర్కొన్నారు.
ప్రతీ ఒక్కరి పాత్ర : సచివాలయ నిర్మాణంలో ప్రతీ ఒక్కరి పాత్ర ఉందని ముఖ్యమంత్రి చెప్పారు. అంబేద్కర్ స్పూర్తితో పని చేసే ప్రభుత్వంగా ఆ మహానీయుడుకి 125 అడుగుల విగ్రహం ఏర్పాటు చేసామన్నారు. అంబేద్కర్ సందేశం మనస్పూర్తిగా పని చేయాలని సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టామని వివరించారు.
ఎంతో మంది తెలంగాణ పునర్ణిర్మాణం పైన మరుగుజ్జు వ్యాఖ్యలు చేసారని..సమైక్య పాలనలో శల్యమైన తెలంగాణలో చెరువులను పునర్ నిర్మాణం చేసామని ముఖ్యమంత్రి చెప్పారు. దేశంలో వరి 94 లక్షల ఎకరాలు పండితే, అందులో తెలంగాణలోనే 50 లక్షల ఎకరాలకు పైగా ఉందన్నారు. కరెంట్ వెలుగులతో విరాజిల్లుతున్నదని వివరించారు. ప్రతీ గూడెంలో మిషన్ భగీరధ తెలంగాణ పునర్ నిర్మాణానికి ప్రతీకగా ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

అద్భుత ప్రగతి : నేడు 24 గంటల కరెంట్‌తో రైతులు కంటి నిండా నిద్ర పోతున్నారని చెప్పారు. గ్రామాలు, పట్టణాలు అభివృద్ధి చెందుతున్నాయన్నారు. అనేక అవార్డులు సొంతం చేసుకుంటున్నాయని వివరించారు. ఆగమైపోయిన అడవులు పునర్నిర్మాణం చేసుకున్నామని..హరితశోభను వెదజల్లుతున్నాయని చెప్పుకొచ్చారు. పారిశ్రామిక విధానంలో లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు.
ఐటీ పరిశ్రమలో బెంగళూరును దాటిపోతున్నామని కేసీఆర్ వెల్లడించారు. చిన్న మత కల్లోలాలు లేకుండా శాంతి భద్రతల విషయంలో పోలీసులు సమర్ధంగా వ్యవహరిస్తున్నారని ప్రశంసించారు. దేశానికి తెలంగాణ పోలీసులు మార్గనిర్దేశకులు గా పేర్కొన్నారు. అంతర్జాతీయ నగరంగా హైదరాబాద్ లో ఎన్నో ఫ్లై ఓవర్లు, అద్భుత ప్రగతి సాధించిందని వివరించారు. వలసలు, ఫ్లోరైడ్ తరిమికొట్టామని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications