జంట నగరాల ప్రజలకు సీఎం కేసీఆర్ గుడ్‌న్యూస్: మరో నెలపాటు గడువు పెంపు
హైదరాబాద్: జంట నగరాల ప్రజలకు సీఎం కేసీఆర్ శుభవార్త అందించారు. హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాల పరిధిలోని మున్సిపాలిటీల పరిధిల్లో ఉన్న పేదల ఇండ్ల నిర్మాణం కోసం ఇబ్బందులు లేకుండా, నిబంధనల మేరకు వారి ఇంటి స్థలాలను క్రమబద్ధీకరించి, వారికి న్యాయపరమైన హక్కులను కల్పిస్తామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు(KCR) స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి నోటరీ స్థలాలను జీఓ 58, 59 ల ప్రకారం క్రమబద్ధీకరించుకోవడానికి మరో నెల రోజులపాటు గడువు పొడిగిస్తున్నట్లు సీఎం ప్రకటించారు.
ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలను సీఎం కేసీఆర్ కోరారు. తక్షణమే తమ తమ నియోజకవర్గాల పరిధిల్లోని ఎమ్మెల్యేలను కలిసి తమకున్న నోటరీ తదితర ఇళ్ల స్థలాల రెగ్యులేషన్ సమస్యలను తెలుపుకోవాలన్నారు. అన్ని సమస్యలను క్రోడీకరించి, పరిష్కరించి, వారికి న్యాయపరమైన హక్కులతో కూడిన పట్టాలను ప్రభుత్వం అందజేస్తుందని సీఎం తెలిపారు.

ఏకకాలంలో ఒకే మొత్తంలో పేదల ఇండ్ల సమస్యలు పరిష్కారం కావాలనేది ప్రభుత్వ ఉద్దేశ్యమని సీఎం కేసీఆర్ అన్నారు. ఇందుకు సంబంధించిన ప్రత్యేక డ్రైవ్ ను నిర్వహించనున్నట్లు తెలిపారు. అదే సందర్భంలో వ్యవసాయ భూముల నోటరీ సమస్యలను కూడా పరిష్కరిస్తామని సీఎం అన్నారు. త్వరలోనే ఇందుకు సంబంధించి కలెక్టర్ల కాన్ఫరెన్సు నిర్వహించనున్నామని తెలిపారు. ఈ మేరకు సోమవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల పరిధిలోని ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని కలిసి విజ్ఞప్తి చేశారు.వారి విజ్ఞప్తి మేరకు నోటరీ, 58,59 జీఓలకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి సానుకూలంగా స్పందించారు.
మరో నెల రోజుల గడువు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ చక్కని అవకాశాన్ని పేదలందరూ సద్వినియోగం చేసుకోవాలని సీఎం మరోసారి కోరారు. ఈ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్సీలు శేరి సుభాష్ రెడ్డి, నవీన్ కుమార్, ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, మాగంటి గోపినాథ్, దానం నాగేందర్, మాధవరం కృష్ణారావు, జాజుల సురేందర్, ఆత్రం సక్కు, ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగ్ రావు, సీఎం కార్యదర్శి స్మితా సభర్వాల్, నవీన్ మిట్టల్, ప్రియాంకవర్గీస్ తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications