మోండా మార్కెట్ చూసి ఆశ్చర్యపోయా:వెజ్, నాన్‌వెజ్ మార్కెట్లపై కేసీఆర్ కీలక ప్రకటన
హైదరాబాద్ నగరంలో జనాభాకు అనుగుణంగా మార్కెట్లు లేవని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. శాస్త్రీయ దృక్పథంతో రాజధానితోపాటు రాష్ట్ర వ్యాప్తంగా వెజ్, నాన్ వెజ్ మార్కెట్లు నిర్మిస్తున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు.
హైదరాబాద్: రాజధాని నగరంలో జనాభాకు అనుగుణంగా మార్కెట్లు లేవని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. శాస్త్రీయ దృక్పథంతో రాజధానితోపాటు రాష్ట్ర వ్యాప్తంగా వెజ్, నాన్ వెజ్ మార్కెట్లు నిర్మిస్తున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు. నేలపై కూరగాయలు పెట్టి విక్రయిస్తే.. బ్యాక్టీరియా ముప్పు ఉంటుందని చెప్పారు. ఆదివారం మార్కెట్ల అంశంపై అసెంబ్లీలో కేసీఆర్ మాట్లాడారు.

మోండా మార్కెట్ చూసి ఆశ్చర్యపోయానన్న కేసీఆర్
నిజాం హయాంలో కట్టిన మోండా మార్కెట్‌ను చూసి తాను ఆశ్చర్యపోయానని కేసీఆర్ తెలిపారు. కోటికిగా జనాభా ఉన్న హైదరాబాద్ నగరంలో సరిపడా వెజ్, నాన్ వెజ్ మార్కెట్లు లేవన్నారు. హైదరాబాద్ మార్కెట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించామని తెలిపారు. మోండా మార్కెట్ మాదిరిగా రాష్ట్రంలో మార్కెట్లు నిర్మించాలని కలెక్టర్లకు సూచించామని కేసీఆర్ తెలిపారు. కల్తీ విత్తనాలు విక్రయించే వారిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తున్నామని, అలాంటి వారిని ఉక్కుపాదంతో అణిచివేయాలన్నారు.

తెలంగాణలో సమీకృత వెజ్, నాన్ వెజ్ మార్కెట్లకు శ్రీకారం
చాలా కూరగాయల మార్కెట్లు అనుకున్నంత పరిశుభ్రంగా లేవన్నారు. ఈ నేపథ్యంలోనే సమీకృత వెజ్, నాన్ వెజ్ మార్కెట్లకు శ్రీకారం చుట్టామని కేసీఆర్ తెలిపారు. ఆధునాతన కూరగాయల మార్కెట్లు ప్రతి నియోజకవర్గంలో తేవాలనే ఆలోచన ఉందన్నారు. మోండా మార్కెట్‌ని కలెక్టర్లందరికీ చూపించామని, అలాంటి మార్కెట్లు అన్ని జిల్లాల్లో నిర్మించాలని సూచించామన్నారు.

ప్రతి నియోజకవర్గంలో మార్కెట్ల నిర్మాణం
కనీసం 2 లక్షల జనాభాకు ఒక మార్కెట్టైనా ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వ లక్ష్యమని సీఎం కేసీఆర్ చెప్పారు. అన్ని నియోజకవర్గాల్లో మార్కెట్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయని కేసీఆర్ వెల్లడించారు. నారాయణపేట కూరగాయల మార్కెట్ చాలా అద్భుతంగా కట్టినట్లు తాను విన్నానని చెప్పారు.

శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్‌గా బండ ప్రకాశ్: కేసీఆర్ అభినందనలు
తెలంగాణ రాష్ట్ర శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్‍గా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ బండ ప్రకాశ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా బండ ప్రకాశ్ పదవీకాలం ఫలప్రదం కావాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. బండ ప్రకాశ్‌కు పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కేసీఆర్ స్వయంగా బండ ప్రకాశ్‌ను తీసుకుని వెళ్లి.. మండలి డిప్యూటీ ఛైర్మన్ కుర్చీలో కూర్చోబెట్టారు. మిగితా సభ్యులు కూడా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థి స్థాయి నుంచి తెలంగాణ ఉద్యమంలో ఆయన కీలక పాత్ర పోషించారని ఈ సందర్భంగా కేసీఆర్ తెలిపారు. తెలంగాణ ప్రజలకు ఆయన సేవలు అవసరమన్నారు. ఉన్నత విద్యావంతుడిగా వరంగల్ జిల్లా వాసిగా సుపరిచితుడని, ముదిరాజ్ సామాజిక అభ్యున్నతికి బండ ప్రకాశ్ కృషి అభినందనీయమన్నారు.












Click it and Unblock the Notifications