మునుగోడులో ఇంఛార్జ్ గా సీఎం కేసీఆర్ - కొత్త సర్వే లెక్కలు ఇలా..!!
తెలంగాణలో ఇప్పుడు మునుగోడు జాతీయ పార్టీల ప్రతిష్ఠకు సవాల్ గా నిలుస్తోంది. టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ గా మారిన సమయంలో..ఎదుర్కొంటున్న తొలి ఎన్నిక. ఇదే సమయంలో ఇక్కడ గెలిచి వచ్చే అసెంబ్లీ ఎన్నికల ముందు టీఆర్ఎస్ కు షాక్ ఇచ్చేందుకు బీజేపీ కి కీలకంగా మారింది. అటు కాంగ్రెస్ కు ఈ ఎన్నిక జీవన్మరణ సమస్య. కాంగ్రెస్ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసి, బీజేపీ నుంచి పోటీ చేస్తుండటంతో ఈ ఎన్నిక కాంగ్రెస్ తో పాటుగా రాహుల్ ప్రతిష్ఠతో ముడి పడింది. బీఆర్ఎస్ ఆవిర్భావంతో తొలి ఎన్నిక మునుగోడు కానుంది.

ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న సీఎం కేసీఆర్
ఇప్పటికే మునుగోడు కోసం సీఎం కేసీఆర్ మంత్రులు - ఎమ్మెల్యేలకు బాధ్యతలు అప్పగించారు. మండలాల వారీగా, గ్రామాల వారీగా ఇన్‌చార్జ్‌లను నియమించారు. అందులో భాగంగా కేసీఆర్ కు బాధ్యతలు తప్పలేదు. మొత్తం గ్రామాల వారీగా పార్టీ ఎమ్మెల్యేలకు ఇంఛార్జ్ బాధ్యతలను ఖరారు చేసారు. అందులో భాగంగా గజ్వేల్ ఎమ్మెల్యేగా ఉన్న కేసీఆర్ మర్రిగూడ మండలంలోని లెంకలపల్లి గ్రామ బాధ్యతలు తీసుకున్నారు. ఈ రోజు నుంచి మంత్రులు కేటీఆర్ - హరీష్ తో పాటుగా పార్టీ నేతలంతా మునుగోడులోనే మకాం వేయాలని సీఎం స్పష్టం చేసారు. కేసీఆర్ తరపున వంటేరు ప్రతాప్ రెడ్డి బృందం ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నది. తాజాగా బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సమయంలో మునుగోడు పార్టీ అభ్యర్ధిని అధికారికంగా ప్రకటిస్తారని భావించారు.

బీజేపీ - కాంగ్రెస్ నుంచి గట్టి పోటీ
పార్టీ నుంచి ప్రభాకర్ రెడ్డి పేరు దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. అటు బీజేపీ -కాంగ్రెస్ రెడ్డి సామాజిక వర్గానికి కేటాయించటంతో ఇటు టీఆర్ఎస్ నుంచి అదే విధంగా కేటాయించే అవకాశం ఉంది. ఇప్పటికే మునుగోడులో పలు రకాల సర్వేలను సీఎం కేసీఆర్ చేయించారు. అందులో గులాబీ పార్టీ ఆధిక్యత స్పష్టంగా కనిపించినట్లుగా సీఎం స్వయంగా పార్టీ సమావేశాల్లో వెల్లడించారు. కానీ, ఎన్నిక పూర్తయ్యే వరకూ ఏ ఒక్కరూ నిర్లిప్తతతో ఉండవద్దని నిర్దేశించారు. టీఆర్ఎస్ తొలి స్థానంలో ఉందని, రెండో స్థానంలో కాంగ్రెస్ ఉందని సర్వే ఫలితాలు వెల్లడైనట్లుగా చెప్పుకొచ్చారు. ఇప్పుడు బీజేపీ మునుగోడు కేంద్రంగా ఇంటింటి ప్రచారం ప్రారంభించింది.

సర్వేలు టీఆర్ఎస్ కు అనుకూలంగా
అటు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ప్రచారం మొదలు పెట్టింది. రాహుల్ గాంధీ పాదయాత్ర ఈ నెల 24 నుంచి తెలంగాణలో ప్రారంభం కానుంది. దీంతో, పాదయాత్ర సమయంలో కీలక నేతలు అటు వెళ్లే అవకాశం ఉండటంతో.. ఈ లోగా సాధ్యమైనంత సమయం మునుగోడు పైన ఫోకస్ చేయాలని భావిస్తున్నారు. దీని కోసం వరుసగా సభలు - రోడ్ షోలకు ప్లాన్ చేస్తున్నారు. రేపు మునుగోడు ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల కానుంది. ఇక, నామినేషన్ల ప్రక్రియ ఆరంభం అవుతుంది. ఈ రోజు అధికారికంగా టీఆర్ఎస్ తమ అభ్యర్ధిని ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. కేసీఆర్ బహిరంగ సభ వచ్చే వారం ఉంటుందని పార్టీ నేతలు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications