రైతాంగానికి సీఎం కేసీఆర్ తీపి కబురు- రూ.19,000 కోట్లు
హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల గడువు దగ్గరపడుతోంది. అక్టోబర్/నవంబర్‌లల్లో నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. డిసెంబర్ నాటికి కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావొచ్చు. ఈ ఎన్నికలను ఎదుర్కొనడానికి అన్ని పార్టీలు కసరత్తు సాగిస్తోన్నాయి. అధికార భారత్ రాష్ట్ర సమితి, కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ.. సర్వశక్తులను ఒడ్డుతున్నాయి.
మూడోసారి అధికారంలోకి రావడానికి బీఆర్ఎస్ సారథి, ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే అనేక వరాలను కురిపించిన విషయం తెలిసిందే. దివ్యాంగులకు పింఛన్ మొత్తాన్ని పెంచడం మొదలుకుని.. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయడం వరకూ పలు ప్రజానుకూల నిర్ణయాలను తీసుకుంటూ వస్తోన్నారాయన.

ఈ క్రమంలో మరో తీపికబురు వినిపించారు గతంలో నిలిచిపోయిన రైతు రుణమాఫీ పథకాన్ని పునరుద్ధరించనున్నట్లు ప్రకటించారు కేసీఆర్. దీనికి ముహూర్తం కూడా పెట్టారు. గురువారం నుంచే ఈ ప్రక్రియను పునఃప్రారంభించనున్నట్లు చెప్పారు. ఈ మేరకు ఆర్థిక మంత్రిత్వ శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావుకు ఆదేశాలు జారీ చేశారు.
నెలన్నర రోజుల్లో రైతు రుణమాఫీ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుందని సూచించారు కేసీఆర్. ఎట్టి పరిస్థితుల్లోనూ సెప్టెంబర్ రెండో వారంలోపు దీన్ని పూర్తి చేస్తామనీ అన్నారు. రైతుల సంక్షేమం, వ్యవసాయాభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఎన్ని అడ్డంకులు ఎదరైనప్పటికీ దీన్ని చిత్తశుద్ధితో అమలు చేసి తీరుతామని చెప్పారు.
రైతుల రుణాలను మాఫీ చేస్తామంటూ ఇచ్చిన హామీ నుంచి వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదని కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ ప్రక్రియలో జాప్యం ఏర్పడటానికి కేంద్ర ప్రభుత్వ విధానాలు కూడా ఓ కారణమని పేర్కొన్నారాయన. కేంద్ర ప్రభుత్వం అనాలోచితంగా తీసుకున్న నోట్ల రద్దు ప్రభావం రుణమాఫీపై పడిందని చెప్పుకొచ్చారు.
ఆ తరువాత కరోనా వైరస్ వ్యాప్తి చెందడం, లాక్‌డౌన్ వంటి పరిణామాల వల్ల ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయని కేసీఆర్ గుర్తు చేశారు. అయినప్పటికీ చిత్తశుద్ధితో దీన్ని పూర్తి చేస్తామని అన్నారు. దశలవారీగా రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా రుణమాఫీ మొత్తాన్ని జమ చేస్తామని స్పష్టం చేశారు.
ఇప్పటికే అందించిన రుణమాఫీ మొత్తం పోగా మరో 19,000 కోట్ల రూపాయలను రైతు రుణమాఫీ కింద జమ చేస్తామని వివరించారు. ఎఫ్ఆర్బీఎం నిధులను విడుదల చేయకుండా కేంద్రంల అనుసరించిన కక్షపూరిత చర్యలు ఆర్థిక ఇబ్బందులను తెచ్చిపెట్టాయని కేసీఆర్ వ్యాఖ్యానించారు.
ఆయా కారణాల వల్ల ఏర్పడిన ఆర్థికలోటుతో ఇన్ని రోజులు రుణమాఫీని అమలు చేయడంలో కొంత ఆలస్యమైందని అన్నారు. తిరిగి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చక్కదిద్దుకున్నందున మళ్లీ దీన్ని పునఃప్రారంభించాలని ఆదేశించారు. రైతుబంధు, రైతు బీమా, ఉచిత విద్యుత్, సాగునీరు వంటి పథకాలను నిరాటంకంగా కొనసాగిస్తూనే వస్తోన్నామని గుర్తు చేశారు.
వ్యవసాయాభివృద్ధి కోసం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఏర్పాటు వంటి ఆదర్శవంతమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోన్నామని వివరించారు. రైతు సాధికారత సాధించే వరకు, వారిని ఆర్థికంగా ఉన్నతంగా తీర్చిదిద్దే వరకు విశ్రమించే ప్రసక్తేలేదని పునరుద్ఘాటించారు. రైతుల సంక్షేమాన్ని, వ్యవసాయాభివృద్ధి కార్యాచరణను విస్మరించబోమనీ అన్నారు.












Click it and Unblock the Notifications