కేసీఆర్ సీరియస్!: దూరం పెట్టారు, నయీం కేసులో సొంత పార్టీ నేతలపై వేటు
హైదరాబాద్: సీఎం కేసీఆర్ ఆదేశాలతో నల్గొండ జిల్లాకు చెందిన నేతలు చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ''గ్యాంగ్‌స్టర్ నయీంతో ఎవరికి సంబంధాలున్నా వదలొద్దు. ఆధారాలు దొరికితే ఇతరులనే కాదు, సొంత పార్టీ వాళ్లనైనా సరే లోపలికి పంపించండి'' సిట్ అధికారులకు సీఎం కేసీఆర్ ఇచ్చిన స్పష్టమైన ఆదేశాలివి.
దీంతో నయీం కేసు విచారణ వేగవంతమంతమైంది. అంతేకాదు మరో 20 రోజుల్లో నయీం కేసుని ముగించాలని ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ కేసులో చట్ట ప్రకారం చేపట్టే చర్యలు, భవిష్యత్తులో ఎవరైనా అసాంఘిక శక్తులతో సంబంధాలు, పరిచయాలు పెంచుకోవాలన్నా భయపడే విధంగా ఉండాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు.

నయీం కేసులో సంబంధమున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య ప్రజాప్రతినిధులపై కఠిన చర్యలు తీసుకుంటే, రాబోయే రోజుల్లో ఆ హోదా కలిగిన వారే కాకుండా, ఇతరులెవరూ భూ దందాలు, సెటిల్‌మెంట్లలో జోక్యం చేసుకోబోరని సీఎం భావిస్తున్నట్లు సమాచారం.
ఇలా చేయడం ద్వారా ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని కేసీఆర్ ఆలోచనగా ఉన్నట్లు తెలుస్తోంది. నయీంతో సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కొంత మంది సొంత పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులను అధికార టీఆర్‌ఎస్ పార్టీ గడచిన కొన్ని రోజులుగా దూరం పెడుతున్నట్లు తెలుస్తోంది.
సీఎం కేసీఆర్‌తోపాటు, కీలక మంత్రులు కూడా వారిని కలవటానికి ఇష్టపడటంలేదని సమాచారం. నయీం కేసుతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు ఎదుర్కొంటున్న సొంత పార్టీ నేతల విషయంలోనే అత్యంత కఠినంగా ఉంటున్న ముఖ్యమంత్రి, నయీంతో సంబంధాలున్న విపక్ష నేతలను వదిలిపెట్టొద్దనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
నయీం కేసు విచారణలో భాగంగా విపక్షాలకు చెందిన ఒక ఎమ్మెల్సీ, ఇద్దరు ఎమ్మెల్యేల పేర్లు తెరపైకి వచ్చాయి. వారికి గ్యాంగ్‌స్టర్ నయీంతో దగ్గరి సంబంధాలున్నట్లు పోలీసుల వద్ద పక్కా ఆధారాలు ఉన్నాయని సమాచారం. గ్రేటర్ పరిధిలోని ఒక విపక్ష ఎమ్మెల్యేకు నయీంతో అనుకోకుండా అనుబంధం ఏర్పడినట్లు విచారణలో పోలీసులు గుర్తించారు.
నగర శివారులో 20 ఎకరాల భూ వివాదంలో నయీం గ్యాంగ్ ఒకరిని హత్య చేసింది. దీంతో అతని భార్య సెటిల్‌మెంట్ కోసం ఈ ఎమ్మెల్యేను ఆశ్రయించింది. ఈక్రమంలోనే ఆయన నయీంతో పలుమార్లు మాట్లాడినట్లు ఫోన్ రికార్డులు పోలీసులకు దొరికినట్లు తెలుస్తోంది. ఆ తర్వాతి కాలంలో నయీంతో ఆ ఎమ్మెల్యే కుమ్మక్కై పలు భూ దందాలు, సెటిల్‌మెంట్లు చేసినట్లు పోలీసులు గుర్తించారు.
అలాగే భూ వివాదం సెటిల్‌మెంట్ కోసం తన వద్దకు వచ్చిన మహిళతో ఆ ఎమ్మెల్యే సన్నిహిత పరిచయం ఏర్పర్చుకున్నట్లు పోలీస్ విచారణలో వెల్లడైనట్లు తెలిసింది. మరో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఇద్దరూ నయీంతో కలిసి భువనగిరి, నల్లగొండ, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో అనేక భూ దందాలు, సెటిల్‌మెంట్లు చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలినట్లు సమాచారం.
ఈ సెటిల్ మెంట్లు, దందాల్లో నయీం గ్యాంగ్ ప్రస్తుత పోలీస్ అధికారులతోపాటు, మాజీ పోలీస్ అధికారులను కూడా భాగస్వాములను చేసినట్లు బయటపడిందని తెలిసింది. ఈ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ.. నయీంతో వివిధ సందర్భాల్లో చేసిన ఫోన్ సంభాషణలు, బెదిరింపు కాల్ రికార్డులు, వారు కలిసి ఉన్నప్పుడు తీసుకున్న ఫొటోలు విచారణ అధికారులకు లభించాయని సమాచారం.
నయీం కేసులో భాగంగా అదుపులోకి తీసుకున్న నిందితులపై స్థానిక కోర్టుల్లోనే చార్జిషీటు దాఖలు చేయాలని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే నయీం కేసులో వినాయక నిమజ్జనం తర్వాత మరిన్ని అరెస్ట్‌లకు పోలీసులు రంగం సిద్ధం చేశారు.












Click it and Unblock the Notifications