ఉద్ధవ్ థాకరేతో కేసీఆర్ భేటీ ముహూర్తం ఇదే: ముంబై నుంచి ఫోన్ కాల్: కలుద్దామంటూ ఆహ్వానం
హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ సారథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ సంకీర్ణ కూటమి ప్రభుత్వంపై తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ప్రకటించిన యుద్ధానికి మద్దతు పెరుగుతోంది. దేశవ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీలు కేసీఆర్ నాయకత్వానికి బల పరుస్తున్నట్టే కనిపిస్తోంది. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, డీఎంకే చీఫ్, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఇప్పటికే కేసీఆర్‌తో టచ్లో ఉన్నారు.

ఉద్ధవ్‌తో భేటీ
శివసేన అధ్యక్షుడు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేను కేసీఆర్ స్వయంగా కలుసుకోబోతున్నారు. దీనికోసం ఆయన ముంబైకి వెళ్లనున్నారు. దీనికి సంబంధించిన తేదీ కూడా ఫిక్స్ అయింది. బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ, కాంగ్రెస్ నాయకత్వాన్ని వహిస్తోన్న యూపీఏ కూటమికి ప్రత్యామ్నాయంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు ప్రయత్నంలో- కేసీఆర్ మరో కీలక ముందడుగు వేసినట్టే. ఈ విషయంలో ఆయన పక్కా ప్రణాళిక ప్రకారమే అడుగులు వేస్తోన్నారు.

మహా సీఎం నుంచి ఫోన్..
కొద్దిసేపటి కిందటే ఉద్ధవ్ థాకరే.. కేసీఆర్‌కు ఫోన్ చేశారు. ముంబైకి రావాల్సిందిగా ఆహ్వానించారు. ఈ నెల 20వ తేదీన కలుద్దామని అన్నారు. కలిసి భోంచేద్దామని స్వాగతించారు. సమాఖ్య స్ఫూర్తిని పరిరక్షించడానికి ఆరంభించిన పోరాటానికి తాను సంపూర్ణ మద్దతును ప్రకటిస్తున్నానని అన్నారు. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి భావసారూప్యం గల శక్తులు ఏకం కావాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ విషయంపై కూలంకషంగా చర్చించడానికి 20వ తేదీన ముంబై రావాలని కోరారు.

జేడీఎస్ ఇదివరకే సపోర్ట్..
కేసీఆర్ ఏర్పాటు చేయదలిచినట్టుగా భావిస్తోన్న ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు జనతాదళ్ (సెక్యులర్) ఇదివరకే తన సంపూర్ణ మద్దతును ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ప్రధానమంత్రి హెచ్‌డీ దేవేగౌడ- కేసీఆర్‌కు ఫోన్ సైతం చేశారు. జాతీయ స్థాయి రాజకీయాలపై చర్చించారు. మూడో ప్రత్యామ్నాయ కూటమి గురించి మాట్లాడారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై కేసీఆర్ మొదలు పెట్టిన యుద్ధంలో తాము కూడా పాల్గొంటామని దేవేగౌడ భరోసా ఇచ్చారు.

టార్గెట్.. బీజేపీ:
కేసీఆర్ టార్గెట్ బీజేపీయే. జాతీయ స్థాయిలో కమల నాథులను ఢీ కొట్టడానికి సైతం వెనుకాడట్లేదు. దీనికోసం జాతీయ స్థాయిలో ప్రాంతీయ పార్టీలు, ప్రతిపక్షాల మద్దతును కూడబెట్టుకుంటోన్నారు. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి మమత బెనర్జీ సైతం త్వరలో హైదరాబాద్‌కు వస్తారనే ప్రచారం సాగుతోంది. ఉద్ధవ్ థాకరేతో సమావేశం అనంతరం- తృణమూల్ అధినేత్రి హైదరాబాద్‌కు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

త్వరలో ఢిల్లీలో..
కేసీఆర్ సారథ్యంలో త్వరలో ప్రతిపక్ష, ప్రాంతీయ పార్టీల ముఖ్యమంత్రులు దేశ రాజధానిలో సమావేశం కానున్నారు. దీనికి ఇంకా తేదీని నిర్ధారించాల్సి ఉంది. ఉద్ధవ్ థాకరేతో భేటీ సందర్భంగా ఈ అంశం కూడా ప్రస్తావనకు రానుంది. బీజేపీ ఎలా ఎదుర్కోవాల్సి ఉంటుందనే విషయంపై చర్చిస్తారు. భావసారూప్యం గల ఇతర పార్టీల నాయకులను కలుపుకొని వెళ్లాల్సి ఉంటుందని, దీనికి సంబంధించిన ఉమ్మడి అజెండాపై ఢిల్లీలో జరిగే ముఖ్యమంత్రుల సమావేశంలో నిర్ధారిస్తారని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications