తెలంగాణ ప్రతిష్ఠ వెలుగులీనేలా సచివాలయం: సీఎం కేసీఆర్; ఆ ఫైలుపై తొలిసంతకం: కేటీఆర్
తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఖ్యాతిని నలుదిశలా చాటేలా తెలంగాణ సెక్రటేరియట్ నిర్మాణం చేసింది. హుస్సేన్ సాగర్ బుద్ధుని చెంత, రాజసాన్ని చాటుతూ తెలంగాణ సెక్రటేరియట్ కనువిందు చేస్తోంది. హైదరాబాద్ కీర్తికిరీటంలో మరో కలికితురాయిగా తెలంగాణ సెక్రటేరియట్ చేరింది. నాలుగు కోట్ల మంది ప్రజలు సగర్వంగా చెప్పుకునేలా తెలంగాణ ప్రజా సౌధమైన తెలంగాణ సెక్రటేరియట్ నిర్మాణం జరిగింది. రేపు తెలంగాణ సీఎం కేసీఆర్ చేతులమీదుగా తెలంగాణ సెక్రటేరియట్ ప్రారంభం కానుంది.
ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయ ప్రారంభోత్సవం సందర్భంగా సెక్రటేరియట్ గురించి ఆయన రాష్ట్ర ప్రజలకు సందేశం ఇచ్చారు. తెలంగాణ ప్రతిష్ట మహోన్నతంగా వెలుగులీనేలా, వినూత్న రీతిలో మహా అద్భుతంగా రాష్ట్ర సెక్రటేరియట్ ను నిర్ణయించుకున్నామని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు.

రాష్ట్ర సచివాలయానికి డాక్టర్.బి.ఆర్.అంబేద్కర్ పేరును పెట్టడం దేశంలో ఇదే మొదటిసారి అని కేసీఆర్ వెల్లడించారు. అంతేకాదు దేశంలోనే మొట్టమొదటి పర్యావరణ అనుకూల మహాద్భుత కట్టడమని పేర్కొన్న కెసిఆర్ ప్రజల ఆకాంక్షలకు తగ్గట్టుగా, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని సెక్రటేరియట్ నిర్మించామని వెల్లడించారు. త్యాగాలతో సంపాదించుకున్న తెలంగాణ రాష్ట్రం అనతికాలంలోనే దేశానికి ఆదర్శంగా నిలిచిందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే నూతన సచివాలయం ప్రారంభమైన తర్వాత, సీఎం కేసీఆర్ తో పాటుగా రాష్ట్ర మంత్రులు మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత తమకు కేటాయించిన చాంబర్లలో ఆసీనులు అవుతారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రితో పాటుగా మంత్రులు పలు ఫైల్స్ పై సంతకాలు చేస్తారు. తెలంగాణ పురపాలక, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ రేపు కొత్త సచివాలయంలో తన చాంబర్లో తొలిగా అత్యంత ముఖ్యమైన ఫైలుపై సంతకం చేయనున్నారు.

ఇక ఈ విషయాన్ని ఆయన ప్రకటించారు. హైదరాబాద్ లో లక్షమందికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీకి సంబంధించిన ఫైల్ పై కేటీఆర్ కొత్త సెక్రటేరియట్ లో తొలి సంతకం చేయనున్నట్టు వెల్లడించారు. పేద ప్రజల కోసమే డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ ఫైల్ పై మొదటి సంతకం చేస్తున్నట్టు మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications