ఎన్నికల వేళ జగన్ ఫార్ములాతో రేవంత్ - కీలక నిర్ణయం..!!
ఎన్నికల వేళ తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి కర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఏపీలో అసెంబ్లీ సమరం ప్రధాన పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది. అటు తెలంగాణలో సీఎం - పీసీసీ చీఫ్ గా ఉన్న రేవంత్ కు మెజార్టీ సీట్లు సాధించటం సమర్ధతకు పరీక్షగా నిలుస్తోంది. ఈ సమయంలో ఏపీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు తెలంగాణ పైన ప్రభావం చూపుతున్నాయి. తాజాగా రేవంత్ తెలంగాణలోనూ ఏపీ సీఎం జగన్ ఫార్ములా అమలుకు సిద్దమయ్యారు.
వాలంటీర్ల వ్యవస్థ
ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ ఎన్నికల ప్రచారంలో కీలకంగా మారింది. ఎన్నికల సంఘం వాలంటీర్లను పెన్షన్ల పంపిణీ నుంచి తప్పించటంతో రాజకీయ దుమారం చెలరేగింది. వాలంటీర్లకు సంబంధించి సీఎం జగన్...టీడీపీ అధినేత చంద్రబాబు హామీలు గుప్పిస్తున్నారు. ప్రజలకు చేరువ అయిన వాలంటీర్లను ఓన్ చేసుకొనే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో, ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం అమలులో ఉన్నటువంటి వాలంటీర్ వ్యవస్థను తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా అవుతున్నట్లు తెలుస్తుంది. పార్లమెంటు ఎన్నికల తర్వాత దాదాపు 36,000 మంది వాలంటీర్లను నియమించబోతున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి తాజాగా సీఎం రేవంత్ రెడ్డి పార్టీ నేతలతో తన ప్రణాళికలను పంచుకున్నట్లు తెలుస్తోంది.

తెలంగాణలోనూ అమలు
వాలంటీర్ల నియామకంలో ఏపీ తరహాలో కాకుండా కొంత మార్పుతో అమలు చేయాలని భావిస్తున్నారు. వీరిని కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన కార్యక్రమాలను ప్రచారం చేయడమే కాకుండా లబ్ధిదారులకు సామాజిక భద్రతా పింఛన్లు, ఇతర సంక్షేమ ప్రయోజనాలను పంపిణీ చేయడం వంటి బాధ్యతలు అప్పగించనున్నారు. ఈ వాలంటీర్లకు గౌరవ వేతనం ప్రభుత్వం చెల్లించనుంది. లోక్‌సభ ఎన్నికలను ఎదుర్కొనేందుకు పార్టీ సన్నద్ధతపై చర్చించేందుకు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన నివాసంలో సీఎం రేవంత్ సమీక్షా సమావేశం నిర్వహించారు. భువనగిరి పార్లమెంట్ లో ఎన్నికల వ్యూహాల గురించి చర్చించారు.
విధి విధానాల పై కసరత్తు
భువనగిరి నుంచి రాజగోపాల్ రెడ్డి సతీమణి లక్ష్మి ఈ టిక్కెట్టును బలంగా ఆశించారు, అయితే ముఖ్యమంత్రికి సన్నిహితుడైన కిరణ్ కుమార్ రెడ్డికి టిక్కెట్ ఇచ్చారు. ఈ సమయంలో రేవంత్ కీలక ప్రతిపాదన చేసారు. ప్రతిభావంతులైన పార్టీ కార్యకర్తలను గుర్తించి, వారికి వాలంటీర్ ఉద్యోగాన్ని అప్పగించడం ద్వారా, ప్రభుత్వం సంక్షేమం మరియు అభివృద్ధి కార్యక్రమాలను అట్టడుగు స్థాయికి సులభంగా చేరవేయవచ్చనే అభిప్రాయం వ్యక్తం అయిందని తెలుస్తోంది. సామాజిక భద్రతా పింఛన్లు మరియు ప్రజలకు వచ్చే ఇతర ప్రయోజనాలను పంపిణీ చేయడానికి వీలుగా వీరి సేవలను వినియోగించుకొనే విధంగా పూర్తి స్థాయిలో విధి విధానాలు - కార్యాచరణ సిద్దం చేయాలని డిసైడ్ అయినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications