మోడీది ప్రచారమే.. రేవంత్! సొంత పార్టీ నేతలకు వార్నింగ్
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసే వరకూ మనం విశ్రమించొద్దని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. శుక్రవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన పీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో సీఎం రేవంత్ పార్టీ శ్రేణులనుద్దేశించి మాట్లాడారు. పదవులు రాలేదని కాంగ్రెస్ నేతలు ఎవరూ నిరుత్సాహ పడొద్దన్నారు.
పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి ఖచ్చితంగా పదవులు వస్తాయని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. నాలుగైదేళ్లు జిల్లా అధ్యక్షులుగా పనిచేసినవారికి నామినేటడెడ్ పదవులు ఇచ్చామని తెలిపారు. పార్టీలో నమ్మకంగా ఉన్నవారికి ఉన్నత పదవులు ఇచ్చామని చెప్పారు. పార్టీ కోసం కష్టపడిన వారికి సముచిత స్థానం కల్పిస్తున్నామని సీఎం రేవంత్ తెలిపారు.

మండలాలు, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఫీడ్‌బ్యాక్ తీసుకుని పదవులు ఇస్తామన్నారు రేవంత్. ప్రస్తుతం రెండేళ్ల కాలానికి కార్పొరేషన్ ఛైర్మన్ పదవులు ఇచ్చామని తెలిపారు. మార్చి 10 లోపు జిల్లాల వారీగా ఇంఛార్జీ మంత్రులు నామినేటె్ పదవులకు సంబంధించిన నివేదికలు ఇవ్వాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. పార్టీ కోసం పనిచేయని ఎంతటి నేతనైనా పక్కన పెడతామని సీఎం రేవంత్ హెచ్చరించారు.
ఇక, రాహుల్ గాంధీ ప్రధాని అయ్యే వరకూ విశ్రమించొద్దని.. ఆయన ప్రధాని అయితే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమకార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాన్నారు. ప్రతిపక్షాల విమర్శలను పట్టించుకోవద్దన్నారు. రాష్ట్రంలో కులగణన అనేది అతిపెద్ద కార్యక్రమమని చెప్పారు.
దేశంలోనే అత్యధిక పన్నులు కడుతున్న రాష్ట్రం తెలంగాణ అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. కష్టపడి చేసే వారికి అవకాశాలు ఇవ్వాల్సిన బాధ్యత పార్టీపైనే ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. తెలంగాణ మోడల్ దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని చెప్పారు. అంతేగాక, గుజరాత్ మోడల్ ఫెయిల్ అయిందని... అయితే, ఆ మోడల్ సక్సెస్ అయ్యిందని నరేంద్ర మోడీ విస్తృతంగా ప్రచారం చేసుకున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.












Click it and Unblock the Notifications