తెలంగాణ నూతన సీఎస్ గా- రేవంత్ మార్క్ నిర్ణయం..!!
తెలంగాణ నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎవరికి అవకాశం దక్కనుంది. ఈ నెలాఖరుతో ప్రస్తుత సీఎస్ రామకృష్ణారావు పదవీ కాలం ముగియనుంది. ఇప్పటికే రామకృష్ణారావు కేంద్రం ఇచ్చిన పొడిగింపులో కొనసాగుతున్నారు. దీంతో.. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ ఎవరికి కొత్త సీఎస్ గా అవకాశం ఇస్తారనే అంశం పైన పలువురి పేర్లు తెర పైకి వస్తున్నాయి. అందులో ఇద్దరి పేర్లు ముందు వరుసలో నిలిచాయి. కాగా.. ఇదే సమయంలో సీఎం రేవంత్ సీఎస్ పదవి విషయం లో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు పదవీ కాలం మార్చి 31తో ముగియ నుంది. ఈ నేపథ్యంలో తదుపరి సీఎస్ ఎవరన్న అంశంపై ఐఏఎస్ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. గత ఏడాది ఆగస్టులో రిటైర్ అయిన రామకృష్ణారావుకు కేంద్రం అప్పట్లో ఏడు నెలల పొడిగింపు ఇచ్చింది. రామకృష్ణారావు పదవీ కాలం పొడిగించాలనే సీఎం రేవంత్ అభ్యర్ధన మేరకు కేంద్రం అప్పట్లో ఈ నిర్ణయం తీసుకుంది.

కాగా.. ఆ సమయం ఈ నెలాఖరుతో ముగియనుంది. దీంతో.. సీఎస్ గా అవకాశం దక్కించుకునేందుకు పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. స్పెషల్ సీఎస్ స్థాయి అధికారులు జయేశ్ రంజన్, సబ్యసాచి ఘోష్, వికాస్ రాజ్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. వీరిలో ఒకరు ఢిల్లీ స్థాయి నుంచి ఈ పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు అధికార వర్గాల్లో ప్రచారం సాగుతోంది. కాగా, సీనియార్టీ ప్రకారం అర్వింద్ కుమార్ పేరు రేసులో ఉండాల్సి ఉన్నా.. ఫార్ములా ఈ రేసు కేసు కారణంగా సైడ్ అయిపోయింది.
ముఖ్యమంత్రి నిర్ణయం పై ఉత్కంఠ
దీంతో, ఇప్పుడు కొత్త సీఎస్ విషయంలో రేవంత్ నిర్ణయం ఏంటనేది కీలకంగా మారుతోంది. అయితే.. ప్రస్తుత పరిస్థితుల్లో జయేష్ రంజన్ కే ఛాన్స్ ఎక్కువగా ఉందంటనే ప్రచారం అధికార వర్గాల్లో జరుగుతోంది. ఇదే సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ ఆలోచన భిన్నంగా ఉన్నట్లుగా తాజా సమాచారం. తాజాగా రామకృష్ణారావు పదవీ కాలాన్ని మరో ఆరు నెలలు పొడిగించాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయం సాధించడంలో ఆయన సఫలమయ్యారనే పేరుంది.
దిల్లీలోని సీనియర్ అధికారులతో ఉన్న సాన్నిహిత్యం వల్ల రాష్ట్ర పెండింగ్ అంశాల క్లియరెన్స్‌లో వేగం పెరిగిందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ కారణాల దృష్ట్యా ప్రస్తుత పరిస్థితుల్లో మార్పు కంటే పొడిగింపే మేలని సీఎం అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో, మరో మూడు నెలలు రామకృష్ణారావు పొడిగింపు కోసం కేంద్రానికి లేఖ రాసే అవకాశం ఉందని సమాచారం. మరి.. రేవంత్ ఈ మేరకు నిర్ణయిస్తే.. కేంద్రం స్పందన ఇక్కడ కీలకంగా మారనుంది. ఇక.. ఒకటి, రెండు రోజుల్లోనే సీఎస్ వ్యవహారంలో స్పష్టత రానుంది.












Click it and Unblock the Notifications