హైకమాండ్ సీరియస్ - రేవంత్ అనూహ్య నిర్ణయం..!!
ముఖ్యమంత్రి రేవంత్ రూటు మార్చుతున్నారు. కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి పైన తాజా మంత్రివర్గ భేటీ అధికారిక అజెండా తరువాత మంత్రులతో చర్చించారు. సమన్వయలేమి కారణంగానే ఓడిపోయినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం పైన చేస్తున్న దుష్ప్రచారం సరైన రీతిలో తిప్పి కొట్టాలని మంత్రులకు నిర్దేశించారు. ఆర్దిక పరిస్థితికి అనుగుణం గానే నిర్ణయాలు అమలు చేయాలని డిసైడ్ అయ్యారు. నియోజకవర్గాల పునర్విభజన విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించాలని నిర్ణయించారు.
హైకమాండ్ ఆగ్రహం
ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్, టీచర్ నియోజకవర్గాల్లో ఓటమి పైన సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేసా రు. మంత్రిమండలి సమావేశంలో ఈ అంశం పైన ముఖ్యమంత్రి స్పందించినట్లు తెలుస్తోంది. ప్రతిపక్షం లో ఉన్న సమయంలో గెలిచిన సీటును.. అధికారంలోకి వచ్చిన తరువాత ఓడిపోవటం పైన పార్టీ అధినాయకత్వం సీరియస్ గా ఉందనే విషయం సమావేశంలో చర్చకు వచ్చింది. దీంతో, త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల సమయానికి పార్టీని బలోపేతం చేసుకోవటం తో పాటుగా.. క్షేత్ర స్థాయిలో బలపడటం పైన ఫోకస్ చేయాలని నిర్ణయించారు. జిల్లాల వారీగా రాజకీయ పరిస్థితులు.. పరిణామాల పై సమీక్షలు చేయాలని నిర్ణయించారు.

మంత్రులు బాధ్యత తీసుకోవాలి
ప్రభుత్వం పైన జరుగుతున్న దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టాలని.. అందుకు అనుసరించాల్సిన వ్యూహాలు, అవలంబించాల్సిన విధానాల పైన మంత్రులు ప్రత్యేకంగా ఫోకస్ పెట్టాలని సీఎం సూచించినట్లు తెలుస్తోంది. రాష్ట్ర ఆర్దిక పరిస్థితి ఈ చర్చలో ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. ఆర్దిక పరిస్థితులకు అనుగుణంగానే నిర్ణయాలు ఉండాలని డిసైడ్ అయ్యారు. పెండింగ్ బిల్లుల చెల్లింపు పైనా చర్చ చేసినట్లు తెలుస్తోంది. ఇక.. కేంద్రం జనాభా ప్రాతిపదికన లోక్ సభ నియోజక వర్గాల పునర్విభజన దిశగా ఆలోచన చేస్తుందనే అంశం పైన ప్రస్తావనకు వచ్చింది. ఈ అంశం పైన అఖిల పక్ష సమావేశాలు నిర్వహించాలని.. దక్షిణాది రాష్ట్రాల నేతలతో సమావేశాలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
అఖిలపక్షంతో ఢిల్లీకి
ఈ నెల 12 నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో బీసీ బిల్లును ప్రవేశ పెట్టి.. చర్చించి ఆమోదించాలని నిర్ణయించారు. ఈ చట్టాలను ఆమోదించాలని కోరుతూ పార్లమెంట్ కు పంపాలని డిసైడ్ అయ్యారు. 50 శాతం రిజర్వేషన్లకు సంబంధించి సుప్రీం తీర్పును మరోసారి పరిశీలించి .. సడలింపుకు ఉన్న అవకాశాలపై కేంద్రంతో చర్చించనున్నారు. కేంద్రం ఆమోదించకపోతే అఖిల పక్షంతో కలిసి ఢిల్లీ వెళ్లాలనే ఆలోచన చేస్తున్నారు. నియోజకవర్గాల పునర్విభజన అంశం పైన ఒక కమిటీ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఈ అంశం పైనా అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి తీర్మానం కేంద్రానికి పంపాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications