ఉద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక హామీ
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తమ సమస్యలను పట్టించుకోవడం లేదంటూ అసంతృప్తి వ్యక్తం చేసిన ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో తాజాగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఉద్యోగ సంఘాల నేతలకు కీలక హామీ ఇచ్చినట్లు తెలిసింది. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఉద్యోగ సంఘాల నేతలతో చర్చలు జరిగాయి.
తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్(టీజీవో) ఉద్యోగుల జేఏసీ ప్రతినిధులకు సీఎం రేవంత్ రెడ్డి సమస్యల పరిష్కారంపై హామీ ఇచ్చారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని.. ప్రభుత్వానికి సహకరించాలంటూ ఉద్యోగులను సీఎం రేవంత్ రెడ్డి కోరారు. అన్ని సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తామన్నారు.

సబ్ కమిటీ ఛైర్మన్‌గా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. మంత్రులు శ్రీధర్ బాబు పొన్నం ప్రభాకర్ సభ్యులుగా ఉద్యోగుల సమస్యలపై సబ్ కమిటీ ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ తెలిపారు. కే కేశవరావు ప్రత్యేక ఆహ్వానితుడిగా సబ్ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. రేపు సాయంత్రంలోపు డీఏలపై స్పష్టత ఇస్తామని ముఖ్యమంత్రి తలిపారు. సీఎస్ శాంతి కుమారి, ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు, జేఏసీ ప్రతినిధులు చర్చల్లో పాల్గొన్నారు.
దీపావళి తర్వాత శాఖల వారీగా ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో కేబినెట్ సబ్ కమిటీ సమావేశమై చరిస్తుందని సీఎం రేవంత్ తెలిపారు. జీవో 317పై సబ్ కమిటీ సమర్పించిన నివేదికపై కేబినెట్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు.
సమావేశం అనంతరం జేఏసీ ప్రతినిధులు మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా అన్ని విషయాలను ఒకదాని తర్వాత ఒకటి పరిష్కరించుకుంటూ వస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారని చెప్పారు. ఉద్యోగుల సమస్యలు కూడా తనకు తెలుసని సీఎం చెప్పారన్నారు. ఒకటి రెండు రోజుల్లో ఒక నిర్ణయం తీసుకుని ప్రకటన చేస్తామన్నారని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు వెల్లడించారు.
బదిలీలు, ఉద్యోగుల సర్వీసు అంశాలను పరిష్కరిస్తామని, వాటితోపాటు మిగితా అన్ని సమస్యలపై చర్చిస్తామని ముఖ్యమంత్రి తెలిపారని చెప్పారు. ఆర్థిక, ఆర్థికేతర సమస్యలను కూడా పరిష్కరిస్తామని సీఎం రేవంత్ చెప్పారని జేఏసీ ప్రతినిధులు తెలిపారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో మాట్లాడి ప్రకటన చేస్తామని సీఎం రేవంత్ చెప్పినట్లు జేఏసీ ప్రతినిధులు తెలిపారు.












Click it and Unblock the Notifications