Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మూడు జోన్లుగా తెలంగాణ విభజన

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ గురించి వివరించారు. తమ ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యాల గురించి నీతి ఆయోగ్ సమావేశంలో ప్రస్తావించారు.

తొలుత- పహల్గాంలో మారణకాండ సృష్టించిన ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఆపరేషన్ సింధూర్ నిర్వహించినందుకు రేవంత్ రెడ్డి.. ప్రధాన‌మంత్రి న‌రేంద్ర మోదీకి, భారత సైన్యానికి అభినందనలు తెలిపారు. 1971లో ఇందిరా గాంధీ నాయకత్వంలో పాకిస్తాన్ ను ఓడించి, ఆ దేశాన్ని రెండు ముక్కలుగా చీల్చిన చరిత్రను గుర్తు చేశారు.

CM Revanth Reddy explained Telangana rising 2047 vision document in NITI Aayog meeting

2047 నాటికి మన భారత దేశాన్ని సూపర్ పవర్ గా, నెంబర్ వన్ గా నిలబెట్టాలన్న మోదీ సంకల్పాన్ని ముఖ్యమంత్రి స్వాగతించారు. 'వికసిత భారత్' ప్రణాళికను రూపొందించడం అభినందనీయమన్నారు. అదే స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ప్రణాళిక సిద్ధమైందని, ఆర్థిక, సామాజిక, పరిపాలన రంగాల్లో ఆదర్శవంతమైన లక్ష్యాలతో తెలంగాణ రైజింగ్​ - 2047 విజన్ డాక్యుమెంట్ రూపొందించామని ప్రకటించారు.

'తెలంగాణ రైజింగ్ విజన్ లోని నాలుగు కీలక అంశాలను ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు. పేదల సంక్షేమం, సమగ్ర పాలసీల రూపకల్పన, వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రా డెవలప్మెంట్, పారదర్శక సుపరిపాలన లక్ష్యాలకు ప్రాధాన్యమిస్తామని అన్నారు. తెలంగాణ సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ కుల గణన, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు, ఎస్సీల ఉప వర్గీకరణకు ప్రజా ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుందని చెప్పారు.

తెలంగాణ సమగ్రాభివృద్ధికి ఇప్పటికే వెల్ఫేర్ అండ్ సోషల్ జస్టిస్ పాలసీ, గ్రీన్ ఎనర్జీ పాలసీ, ఇన్ఫ్రా అండ్ ఇండస్ట్రియల్ పాలసీ, టూరిజం పాలసీలను సిద్ధం చేసి కార్యాచరణలో పెట్టినట్లు రేవంత్ రెడ్డి వివరించారు. అభివృద్ది, సంక్షేమంలో ఆయా వర్గాలకు న్యాయమైన వాటా ఇవ్వాలన్నది తమ సంకల్పమని పేర్కొన్నారు.

అందుకే తెలంగాణలో సామాజిక, ఆర్ధిక, విద్య, ఉద్యోగ, రాజకీయ కుల గణన చేపట్టామని, బీసీలకు విద్య, స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు, ఎస్సీ ఉపకులాల వర్గీకరణ.. ఈ రెండు చరిత్రాత్మక నిర్ణయాలను దేశంలోనే మొట్టమొదటగా తెలంగాణ అమలు చేయడం గర్వంగా ఉందని వివరించారు.

దేశవ్యాప్త కుల గణనకు కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ముఖ్యమంత్రి స్వాగతించారు. కులగణనలో తెలంగాణ అనుభవాలను పంచుకునేందుకు సిద్ధంగా ఉందన్నారు. 2028 నాటికి రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యాన్ని ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో మహిళలకు కీలక పాత్ర ఉండేలా విధానాలు రూపొందించినట్లు రేవంత్ రెడ్డి చెప్పారు.

మహాలక్ష్మీ ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కే గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ ఇళ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళా సంఘాలకు రూ.లక్ష కోట్ల రుణాలు, మహిళా సంఘాలకు పాఠశాలల నిర్వహణ, శిల్పారామంలో 100 స్టాళ్లతో మహిళా బజార్ అంశాలను ప్రధానంగా ప్రస్తావించారు.

సోలార్ పవర్ జనరేషన్ లోనూ భాగస్వామ్యం కల్పించి మహిళలను వ్యాపార, పారిశ్రామికవేత్తలుగా ప్రోత్సహించే కార్యక్రమాలు అమలు చేశామని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో యువతదే కీలక పాత్ర అని, అందుకే యువత ఆశయాల సాధనకు అనుగుణంగా యూత్ పాలసీ అమలు చేస్తున్నామని రేవంత్ తెలిపారు.

60,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని, ప్రైవేటు రంగంలో లక్ష ఉద్యోగాలు సృష్టించామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ఒకవైపు మానవ వనరులకు డిమాండ్ పెరుగుతున్నా మరోవైపు నిరుద్యోగ సమస్య నెలకొందని, నైపుణ్యాల కొరతే ఈ అంతరానికి కారణమని గుర్తించామని అన్నారు.

అందుకే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, పోలీస్ స్కూల్, ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్స్, ఐటీఐలను అడ్వాన్సుడ్ టెక్నాలజీ సెంటర్లుగా ఆధునీకరించి స్కిల్ శిక్షణ ఇస్తున్నామని సీఎం వివరించారు. తెలంగాణను డ్రగ్స్ ఫ్రీ స్టేట్ గా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి ప్రకటించారు.

మాదక ద్రవ్యాల నిర్మూలన, వాటికి అడ్డుకట్ట వేయటంలో139 దేశాల్లో తెలంగాణ నెంబర్-1 స్థానం సాధించిన విషయాన్ని గుర్తు చేశారు. రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా యువతకు రూ.5 లక్షల స్వయం ఉపాధి పథకాన్ని జూన్ 2 నుంచి ప్రారంభిస్తామి అన్నారు. దేశానికి రైతే వెన్నెముక అని, ఆ వెన్నెముక కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.

రైతుల ఆత్మహత్యలకు అప్పులే ప్రధాన కారణమని, వారిని అప్పుల ఊబి నుండి బయటకు తేవడం, తిరిగి ఆ ఊబిలోకి జారిపోకుండా నిలబెట్టాలన్న లక్ష్యాలతో పని చేస్తున్నామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణలో 25.35 లక్షల మంది రైతులకు, రూ.20,616 కోట్ల రుణమాఫీ చేసి వారిని రుణ విముక్తులను చేశామని అన్నారు.

సాగు కోసం రైతు మళ్లీ అప్పుల పాలు కాకూడదన్న ఉద్దేశంతో ఎకరాకు రూ.12 వేల రైతు భరోసా సాయం చేస్తున్నామని, బియ్యానికి మద్ధతు ధరకు అదనంగా క్వింటాల్ కు రూ.500 చెల్లించి వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తున్నామని, రైతుకు చేదోడుగా ఉండే వ్యవసాయ కూలీకి రూ.12,000 ఆర్థిక సాయం చేస్తున్నామని రేవంత్ తెలిపారు.

2047 నాటికి ఇండస్ట్రీ, ఇన్ ఫ్రా విషయంలో అంతర్జాతీయ నగరాల సరసన తెలంగాణను నిలబెట్టే భవిష్యత్తు లక్ష్యంతో తెలంగాణ రైజింగ్​ - 2047 విజన్​​ ఎంచుకున్నట్లు చెప్పారు. ఈ లక్ష్య సాధనలో తొలి అడుగుగా.. ఏడాదిన్నర కాలంలో అమెరికా, జపాన్, సింగపూర్, దక్షిణ కొరియా, దావోస్ (స్విట్జర్ లాండ్) దేశాలలో పర్యటించి రూ. 3 లక్షల కోట్ల పెట్టుబడులను సాధించామని అన్నారు.

తెలంగాణ రాష్ట్రం మొత్తాన్ని మూడు జోన్లుగా విభజించి మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నామని, తెలంగాణను కోర్ అర్బన్, సెమీ అర్బన్, రూరల్ తెలంగాణగా విభజించి వృద్ధి సాధిస్తామన్నారు. తెలంగాణలో కోర్ అర్బ‌న్‌, సెమీ అర్బ‌న్‌, రూర‌ల్ విభాగాల్లో మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్, మెట్రో రైల్ సెకండ్ ఫేజ్, ఫ్యూచర్ సిటీ నిర్మాణం, మాన్యూఫాక్చరింగ్ హబ్, అగ్రిబేస్డ్ ప‌రిశ్ర‌ములు ఏర్పాటు చేస్తామ‌న్నారు.

సబర్మతీ రివర్ ఫ్రంట్, గంగా పునరుద్ధరణ ప్రాజెక్ట్ మాదిరిగా తెలంగాణలో మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును అభివృద్ధి చేయాలనే ఆలోచన ఉందని, మెట్రో సెకండ్ ఫేజ్, రీజనల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టులు ప్రస్తుతం డీపీఆర్ ల స్టేజ్ లో ఉన్నాయని రేవంత్ వివరించారు. హైదరాబాద్‌ను డేటా సెంటర్ హబ్‌గా మార్చాలనే లక్ష్యం పెట్టుకున్న‌ట్లు చెప్పారు.

వికసిత భారత్‌ లక్ష్య సాధన తమ ఆశయమని, అందులో తెలంగాణ కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షిస్తోన్నట్లు రేవంత్ పేర్కొన్నారు. నేషన్ ఫస్ట్- పీపుల్ ఫస్ట్ అనే ప్రాధాన్యతతో ముందుకు వెళుతున్నామని, కేంద్రం సహాయ సహకారం మద్దతు లేకుండా తెలంగాణ రైజింగ్ విజన్ అమలు చేయలేమని, రాష్ట్ర సమగ్రాభివృద్ధికి సహకరించాలని కోరారు. వికసిత భారత్ లక్ష్య సాధనలో తెలంగాణ మొదటి వరుసలో ఉంటుందని మాట ఇస్తున్నానని చెప్పారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+