100 రోజుల పాలన అజెండా: రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు- ఆదేశాలు
Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ.. ఎన్నికల ప్రచార సమయంలో వారి ఇచ్చిన ఆరు గ్యారంటీల హామీలను నెరవేర్చే దిశగా కసరత్తు మొదలుపెట్టింది. ఇప్పటికే టీఎస్ఆర్టీసీ బస్సుల్లో మహాలక్ష్మి పథకం అమల్లోకి వచ్చింది. రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద 10 లక్షల వరకు ఉచిత వైద్య సౌకర్యాన్ని ప్రవేశపెట్టింది.
మిగిలిన వాటి అమలుపై రేవంత్ రెడ్డి దృష్టి సారించారు. ఇందులో భాగంగా- జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో నేడు సమావేశం కానున్నారు. ఉదయం 10 గంటలకు సచివాలయంలో ఈ భేటీ షెడ్యూల్ అయింది. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, వివిధ శాఖల మంత్రులు, కార్యదర్శులు, విభాగాధిపతులు ఇందులో పాల్గొంటారు.

ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించిన తరువాత కలెక్టర్లు, ఎస్పీలతో రేవంత్ నిర్వహించబోతోన్న తొలి భేటీ ఇదే కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రధానంగా 100 రోజుల్లో ఆరు గ్యారంటీల అమలు, ప్రజాపాలన కార్యక్రమం తీరు తెన్నులపై ఇందులో చర్చిస్తారు. జిల్లా అధికార, పోలీసు యంత్రంగానికి దిశా నిర్దేశం చేస్తారు.
ప్రస్తుతం ప్రతి మంగళ, శుక్ర వారాల్లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది రేవంత్ సర్కార్. హైదరాబాద్‌కే పరిమితమైన ఈ కార్యక్రమాన్ని మరింత సమర్థవంతంగా జిల్లా, డివిజన్, మండలం, గ్రామ స్థాయిలో తీసుకెళ్లడానికి చేపట్టాల్సిన కార్యాచరణ ప్రణాళికపై ఈ సమావేశంలో చర్చిస్తారు.
ప్రభుత్వాన్ని గ్రామస్థాయి వరకు తీసుకెళ్లడానికి ఉద్దేశించిన ప్రజా పాలన కార్యక్రమంపై సమీక్ష నిర్వహిస్తారు. ప్రజా పాలనను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది రేవంత్ ప్రభుత్వం. ప్రజావాణికి కొనసాగింపుగా రూపొందించిన ప్రజా పాలనను విజయవంతం చేయడం ద్వారా ధరణి సహా ప్రజల నుంచి అందుతున్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించవచ్చని ఆయన భావిస్తోన్నారు.
ఈ నెల 28వ తేదీ నుంచి జనవరి 6వ తేదీ వరకు ప్రజా పాలన కొనసాగుతుంది. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మళ్లీ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ ప్రజాపాలన గ్రామ సభలు నిర్వహిస్తారు. స్థానిక ప్రజా ప్రతినిధులను ఇందులో భాగస్వామ్యులను చేశారు.












Click it and Unblock the Notifications