రైతు బంధుపై రేవంత్ రెడ్డి ప్రకటన..!!
Rythu Bandhu: అసెంబ్లీలో రైతు బంధుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. వ్యవసాయం చేసుకునే వారికి పెట్టుబడి సహాయం కింద కొంత నగదు మొత్తాన్ని అమలు చేయాలనేది ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. గత కేసీఆర్ ప్రభుత్వం అనుసరించిన విధానాలను తప్పుపట్టారు. అప్పట్లో చోటు చేసుకున్న లోపాలన్నింటినీ ఆయన అంకెలతో సహా అసెంబ్లీలో వివరించారు.
గత ప్రభుత్వం గొప్పలకు పోయి, నిర్లక్ష్యంగా, బాధ్యతారహితంగా వ్యవహరించడం వల్ల సాగులో లేని భూములు, రాళ్లు, రప్పలు, గుట్టలు, రోడ్లు, పరిశ్రమలుగా రూపాంతరం చెందిన వాటికి, లై అవుట్లు వేసిన వాళ్లకు కూడా రైతు బంధు కింద డబ్బులు జమ అయ్యాయని అన్నారు.

ఈ విధంగా 22,606 కోట్ల రూపాయలు దుర్వినియోగానికి గురయ్యాయని రేవంత్ రెడ్డి వివరించారు. గత ప్రభుత్వం మొత్తం 72,816 కోట్ల రూపాయలను రైతు బంధు పథకం కింద జమ చేయగా.. ఇందులో 22,606 కోట్ల రూపాయలు అయాచితంగా అనర్హులకు చేరిందని ఆయన సభ దృష్టికి తీసుకొచ్చారు.
గత ప్రభుత్వం అనుసరించిన విధంగా రాళ్లు, రప్పలు, గుట్టలకు కూడా రైతు బంధు పథకాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉందా? అని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న గజ్వేల్ నియోజకవర్గంలో రాజీవ్ రహదారి, ఆమనగల్‌లో శ్రీశైలం రోడ్ల కింద పోయిన భూములకు కూడా రైతు బంధు పథకం కింద నిధులు అందాయని అన్నారు.
కొన్ని చోట్ల క్రషర్లు, మరికొన్ని చోట్ల మైనింగ్ జరుగుతున్న భూములకు కూడా రైతు బంధు అమలు అయిందని, గిరిజనులు, ఆదివాసీల పేర్ల మీద బీఆర్ఎస్ నాయకులు నకిలీ పాస్ పుస్తకాలను సృష్టించి రైతు బంధు కింద లబ్ది పొందారని రేవంత్ రెడ్డి సభకు కూలంకషంగా వివరించారు.
హైదరాబాద్‌కు చుట్టూ 50 కిలోమీటర్ల పరిధిలో 70 నుంచి 80 శాతం వ్యవసాయం ఎవరూ చేయట్లేదని, వ్యవసాయ స్థలాలన్నీ కూడా రియల్ ఎస్టేట్‌గా, లే అవుట్లుగా మారాయని, ప్లాట్లుగా మారాయని పేర్కొన్నారు. గత ప్రభుత్వం ప్రతి సంవత్సరం కూడా రెండు సీజన్లకు కలిపి మూడు కోట్ల హెక్టార్లకు డబ్బులు ఇచ్చుకుంటూ పోయారని, ఇలా 22,606 కోట్ల రూపాయలు దుర్వినియోగం అయ్యయాని అన్నారు.












Click it and Unblock the Notifications