Revanth Reddy: గవర్నర్ తమిళి సైని కలిసి శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర గవర్నర్ తమిళి సైని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్ లోని రాజ్ భవన్ లో నిర్వహించిన ఓపెన్ హౌస్ కార్యక్రమానికి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. రేవంత్ రెడ్డి దంపతులు గవర్నర్ తమిళి సైకి పుష్ఫగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత రాజ్ భవన్ కు వెళ్లడం ఇదే తొలిసారి. రేవంత్ రెడ్డి మంత్రులు కొండా సురేఖ, సీతక్క, స్పీకర్ గడ్డం ప్రసాద్ రాజ్ భవన్ కు వెళ్లారు.
అంతకుముందు సెక్రటేరియట్ లో కొత్త ఏడాది హంగామా కనిపించింది. మంత్రులు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి విషెస్ చెప్పారు. మంత్రి సీతక్క రేవంత్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. రేవంత్ కు ఇందిరా గాంధీ ఫొటోను గిఫ్ట్ గా ఇచ్చారు. అధికారులు సీఎం కు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే మంత్రులకు కూడా విషెస్ చెప్పారు. సాధారణ ప్రజలు కూడా ముఖ్యమంత్రిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సరం సందర్భంగా సచివాలయం వద్ద రేవంత్ రెడ్డి ఫ్లెక్సీలను భారీగా ఏర్పాటు చేశారు.

మాజీ మంత్రి షబ్బీర్ అలీ రేవంత్ రెడ్డిని కలిసి న్యూ ఇయర్ విషెస్ చెప్పారు. అంతకు ముందు రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు నూతన సంవత్సర శుభాకంక్షలు చెప్పారు. అందరి సహకరంతో రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. ఇనుప కంచెలను తొలగంచి.. పాలనలో ప్రజలను భాగస్వాములను చేశామని గుర్తు చేశారు. కొత్త సంవత్సరంలో మిగతా గ్యారెంటీల అమలుకు సిద్ధంగా ఉన్నామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమం అందిస్తామని తెలిపారు.
ఈనూతన సంవత్సరం రైతు, మహిళా,యువత నామ సంవత్సరంగా సంకల్పం తీసుకున్నట్లు చెప్పారు. గతపాలనలో స్తంభించిన పాలన వ్యవస్థ సమూల ప్రక్షాళన చేయాలన్నారు. ప్రజా పాలనకు అనుగుణంగా వ్యవస్థల పునర్ వ్యవస్థీకరణ జరుగుతుందని చెప్పారు. ప్రజల బాధలు వినేందుకు ప్రజాభవన్ లో ప్రజావాణి కార్యక్రమం ప్రారంభించినట్లు పేర్కొన్నారు. త్వరలో సాగునీటి రంగంలో అవినీతిపైకూడా శ్వేతపత్రం విడుదల చేస్తామని వివరించారు.












Click it and Unblock the Notifications