రేవంత్ సంచలనం: ఓఆర్ఆర్ టెండర్ విచారణకు సెట్ ఏర్పాటు
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు (ORR) టోల్ టెండర్లపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేస్తామని తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. గురువారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఔటర్ రింగ్ రోడ్డు టోల్ కాంట్రాక్టుపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు కోరిక మేరకు విచారణకు ఆదేశిస్తున్నట్లు తెలిపారు.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జైకా నుంచి నిధులు తెచ్చి ఓఆర్ఆర్ నిర్మించారని రేవంత్ తెలిపారు. అయితే, దాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పనంగా టెండర్ ను ఎవరికో అప్పగించిందని మండిపడ్డారు. ఎయిర్‌పోర్టు, ఓఆర్ఆర్, ఐటీ కంపెనీలను తీసుకొచ్చి హైదరాబాద్‌ను విశ్వనగరంగా చేసింది కాంగ్రెస్సేనని అన్నారు. ఆ క్రెడిట్ అంతా కాంగ్రెస్ కే దక్కుతుందన్నారు.

ప్రజల అవసరాలు తీర్చేందుకు కృష్ణా, గోదావరి నీళ్లు తేవడానికి పీజేఆర్ ఉద్యమాలు చేశారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. హైదరాబాద్‌కు మెట్రో రైలు తీసుకొచ్చింది కూడా కాంగ్రెస్సేనని అన్నారు. హైదరాబాద్ అంతర్జాతీయ నగరంగా మారడానికి కాంగ్రెస్సే కారణమని చెప్పారు. వేల కోట్ల ఓఆర్ఆర్ ఆస్తిని అప్పనంగా అమ్ముకున్నారని బీఆర్ఎస్ పై మండిపడ్డారు.
ప్రజలు ఓడించబోతున్నారని తెలిసి.. అమ్మేసుకున్నారని రేవంత్ ఆరోపించారు. దేశం విడిచిపెట్టి పోవాలనే ఉద్దేశంతోనే ఓఆర్ఆర్ ఆస్తులను గత ప్రభుత్వాధినేతలు అమ్మేసుకున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. హరీశ్ రావు విచారణ కోరారు.. ఆయన కోరిక మేరకు సెట్ విచారణకు ఆదేశిస్తున్నట్లు రేవంత్ రెడ్డి చెప్పారు. విధి విధానాలు మంత్రివర్గంలో చర్చించి విచారణ చేయిస్తామన్నారు.
ఈ నేపథ్యంలో స్పందించిన హరీశ్ రావు.. తాను ఓఆర్ఆర్‌పై విచారణ కోరలేదన్నారు. అయినా కూడా తాను విచారణను స్వాగతిస్తున్నట్లు తెలిపారు. అయితే, ముందు ఆ టెండర్ రద్దు చేసి విచారణకు ఆదేశించాలని హరీశ్ రావు కోరారు.












Click it and Unblock the Notifications